అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad Police | హైదరాబాద్ నగరంలో ఇటీవల నేరాలు పెరిగాయి. చోరీలు, దాడులు, హత్యలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. గంజాయి, డ్రగ్స్ దందా జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో నగర పోలీసులు నేరాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
నగరంలో సీపీ సజ్జనార్ (CP Sajjanar) ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి పది గంటల తర్వాత ఆపరేషన్ కవచ్ నిర్వహించారు. శాంతిభద్రతలను మరింత పటిష్టం చేసే దిశగా.. నగరవ్యాప్తంగా విస్తృతమైన నాకాబందీని నిర్వహించినట్లు సీపీ తెలిపారు. కమిషనరేట్ (Commissionerate) చరిత్రలోనే మునుపెన్నడూ లేని రీతిలో దాదాపు 5,000 మంది పోలీసు సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. ఏకకాలంలో 150 కీలక ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు నిర్వహించారు.
Hyderabad Police | గ్లోబల్ సమ్మిట్ నేపథ్యంలో..
ఈ ప్రత్యేక డ్రైవ్‌లో లా అండ్ ఆర్డర్ (Law & Order), ట్రాఫిక్, టాస్క్ ఫోర్స్ విభాగాలతో పాటు ఆర్మ్‌డ్ రిజర్వ్, బ్లూ కోల్ట్స్, పెట్రోలింగ్ బృందాలు పాల్గొన్నాయి. ఎక్కడైనా అనుమానాస్పద కదలికలు గమనిస్తే వెంటనే డయల్ 100 కు సమాచారం అందించాలని సీపీ కోరారు. రాష్ట్రంలో త్వరలో గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. ఈ క్రమంలో ఆపరేషన్ కవచ్ (Operation Kavach) నిర్వహించడం గమనార్హం. సీపీ స్వయంగా తనిఖీలలో పాల్గొన్నారు. అనంతరం కంట్రోల్ నుంచి పర్యవేక్షించారు. ఈ తనిఖీల్లో పలువురు అనుమానాస్పద వ్యక్తులను విచారించినట్లు సమాచారం. నిబంధనలు పాటించని వాహనదారులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.
