అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nz vs IND | టీ20 వరల్డ్ కప్ ముంగిట భారత జట్టుకు ఎదురవుతున్న అతిపెద్ద సవాల్ న్యూజిలాండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్. ఇటీవల సౌతాఫ్రికాతో టెస్టుల్లో వైట్‌వాష్, న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ పరాజయం తర్వాత టీమ్ ఇండియా (Team India) ఆత్మవిశ్వాసం దెబ్బతిన్న పరిస్థితిలో ఉంది.
ఇలాంటి క్లిష్ట సమయంలో కివీస్‌తో జరిగే ఈ టీ20 సిరీస్‌ను చివరి ప్రధాన సన్నాహక పరీక్షగా భావిస్తున్నారు. ఫిబ్రవరి 7 నుంచి టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుండగా, ప్రాక్టీస్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఇంకా ప్రకటించలేదు. దీంతో జనవరి 31 వరకు జరగనున్న ఈ ఐదు టీ20ల సిరీస్‌నే రెండు జట్లకు చివరి ప్రాక్టీస్ వేదికగా మారింది. భారత్ ఈ సిరీస్‌లో తన లోపాలను సరిదిద్దుకుని, సరైన కాంబినేషన్‌ను ఫిక్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
Nz vs IND | సూర్యకుమార్ ఫామ్‌పై ఆందోళన
భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Surya Kumar Yadav) నాయకత్వ పరంగా ప్రశంసలు అందుకుంటున్నా, అతని వ్యక్తిగత బ్యాటింగ్ ఫాం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. 2024లో టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత సూర్య నాయకత్వంలో భారత్ 70 శాతం పైగా మ్యాచ్‌లు గెలిచింది. కానీ ఇటీవలి కాలంలో వరుస వైఫల్యాలు అతనిపై ఒత్తిడి పెంచుతున్నాయి. కివీస్‌తో సిరీస్‌లో సూర్య మళ్లీ తన సహజమైన దూకుడు బ్యాటింగ్‌ను ప్రదర్శిస్తాడా అనే దానిపై అందరి చూపు ఉంది. టెస్టులు, వన్డేల్లో ఫలితాలు నిరాశపరిచినా, టీ20 ఫార్మాట్‌లో మాత్రం భారత్ ఇంకా ఆధిపత్యం కొనసాగిస్తోంది. 2024 టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) విజయం తర్వాత భారత్ ఈ ఫార్మాట్‌లో ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదు. అదే జోరును కొనసాగిస్తూ న్యూజిలాండ్‌ను ఓడిస్తే, ప్రపంచ కప్‌కు ముందు జట్టుకు కావాల్సిన ఆత్మవిశ్వాసం వస్తుంది.
గాయంతో తిలక్ వర్మ (Tilak Varma) దూరం కావడంతో శ్రేయస్ అయ్యర్‌కు అవకాశం దక్కింది. మూడేళ్లకు పైగా టీ20ల్లో ఆడని శ్రేయస్ ఈసారి ఎలా స్పందిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. ఓపెనింగ్‌లో అభిషేక్ శర్మ, సంజు శాంసన్‌పై భారీ ఆశలు ఉన్నాయి. అభిషేక్ విధ్వంసకర బ్యాటింగ్ జట్టుకు వేగంగా ఆరంభం ఇస్తుందని భావిస్తున్నారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మెరిసిన ఇషాన్ కిషన్ మూడో స్థానంలో కీలక పాత్ర పోషించనున్నాడు. మిడిల్ ఆర్డర్‌లో హార్దిక్ పాండ్యా ప్రధాన బలంగా నిలవనున్నాడు. అతనితో పాటు శివమ్ దూబే కూడా ఆల్‌రౌండర్‌గా కీలకంగా మారనున్నాడు.నాగ్‌పూర్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండటంతో బుమ్రా ఒక్కరే స్పెషలిస్టు పేసర్‌గా ఆడే అవకాశం ఉంది. స్పిన్ విభాగంలో అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిపై బాధ్యతలు పడనున్నాయి. వన్డేల్లో తేలిపోయిన బౌలింగ్‌ను టీ20ల్లో అయినా సరిదిద్దుకోకపోతే వరల్డ్ కప్‌లో ఇబ్బందులు తప్పవు. ఈ సిరీస్‌లో సరైన జట్టు కాంబినేషన్, ఫామ్‌లోకి రావడం, ఆత్మవిశ్వాసం తిరిగి పొందడం భారత్‌కు అత్యంత కీలకం.