అక్షరటుడే, వెబ్‌డెస్క్: Harish Rao | రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమాలు, బొగ్గు స్కాంలు, భూ స్కాంలు, హామీలపై ప్రశ్నిస్తున్నందుకే తనకు నోటీసులు ఇచ్చారన్నారు.
హరీశ్‌రావు మంగళవారం ఉదయం తన ఇంటి వద్ద మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో సిట్ నోటీసులు అందడంపై స్పందించారు. తాను విచారణకు హాజరు అవుతానని తెలిపారు. నిన్న సాయంత్రం నోటీసులు ఇచ్చి, ఇవాళ ఉదయం విచారణకు రమ్మన్నారని ఆయన పేర్కొన్నారు. తాటాకు చప్పుళ్లకు భయపడేదిలేదని, డైవర్షన్ కోసమే ఇలా నోటీసులు పంపించారని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికలకు (Municipal Elections) ముందు, వీరి అవినీతి బయటపడుతుందని భయపడి నోటీసులు ఇచ్చారన్నారు.
Harish Rao | కోర్టులు కొట్టేశాయి
గతంలో తన మీద ఫోన్ ట్యాపింగ్ కేసు పెడితే హైకోర్టు (High Court), సుప్రీంకోర్టు (Supreme Court) కొట్టేశాయని మాజీ మంత్రి గుర్తు చేశారు. అయినా ఆ కేసులో ఏదో ఉందని రెండేళ్ల నుంచి డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. సీఎం ఎన్ని డ్రామాలు చేసినా తాము వదిలిపెట్టమన్నారు. కుంభకోణాల గురించి నిలదీస్తూనే ఉంటామని పేర్కొన్నారు. ఎన్నికలు ఉన్నప్పుడు తమ పార్టీ నాయకులకు నోటీసులు ఇస్తున్నారని చెప్పారు. పంచాయతీ ఎన్నికలు (Panchayat Elections) ఉన్నప్పుడు కేటీఆర్‌కు, మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయని ఇప్పుడు తనకు నోటీసులు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం బావమరిది బాగోతాన్ని సోమవారం ఉదయం బయట పెడితే రాత్రికి తనకు నోటీసులు ఇచ్చారన్నారు.
Harish Rao | కిషన్‌రెడ్డికి లేఖ
కిషన్ రెడ్డికి తాను బహిరంగ లేఖ రాస్తున్నట్లు హరీశ్‌రావు పేర్కొన్నారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్న ఆయన రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తో కుమ్మక్కు కాకపోతే, వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. సింగరేణి టెండర్ల విషయంలో రేవంత్ రెడ్డి బావమరిది చేసిన అక్రమాలు అన్నిటికి తాను ఆధారాలు ఇస్తానని పేర్కొన్నారు.