Kamareddy
Kamareddy | కబ్జాదారులకు సీఐ అండగా నిలుస్తున్నారని ఎస్సీ కమిషన్​కు ఫిర్యాదు

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | జిల్లాలో ఓ సీఐ తీరు వివాదాస్పదంగా మారినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సదరు సీఐ అక్రమార్కులకు అండగా నిలుస్తూ ఫిర్యాదులను పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడీ అంశం జాతీయ ఎస్సీ కమిషన్ (National SC Commission) వరకు వెళ్లినట్లు తెలుస్తోంది.

దీంతో ఆరోపణలపై పూర్తి నివేదిక ఇవ్వాలని కమిషన్ అదనపు డీజీపీ (Additional DGP), జిల్లా ఎస్పీకి ఈనెల 8న నోటీసులు జారీ చేసింది. అయితే ఈ విషయం ఆలస్యంగా బయటకు రావడంతో పోలీసు శాఖలో (police department) ఏం జరుగుతోందన్న చర్చ సాగుతోంది. జిల్లాలోని ఓ సీఐపై తరచుగా కొందరి నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. భూ కబ్జాలు, అక్రమ నిర్మాణాలు (illegal constructions), చెరువుల ఆక్రమణలపై వచ్చిన ఫిర్యాదులను నిర్లక్ష్యం చేసి, కబ్జాదారుల పక్షాన వ్యవహరించాడని బాధితులు ఎస్సీ కమిషన్​కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

ఈ ఆరోపణలపై కమిషన్ సీరియస్‌గా స్పందించింది. కామారెడ్డి జిల్లా ఎస్పీతో (Kamareddy District SP) పాటు రాష్ట్ర లా & ఆర్డర్ అదనపు డీజీపీకి నోటీసులు జారీ చేసి, ఫ్యాక్ట్‌ ఫైండింగ్ రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించింది. బాధిత దళితులు ఈ విషయాన్ని నేరుగా ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు సమాచారం. దళితులను అవమానపరుస్తూ హక్కుల ఉల్లంఘన జరిగినా.. సీఐపై చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని, పోలీస్ స్టేషన్(police station)లో తమకు గౌరవం లేకుండా ప్రవర్తించారని బాధితులు ఆరోపిస్తున్నారు.

ఫిర్యాదులు సీఎం వరకు వెళ్లడంతో ఎలాంటి చర్యలు తీసుకుంటారోనన్న చర్చ సాగుతోంది. పోలీసు శాఖలో కిందిస్థాయి సిబ్బందిపై చిన్న చిన్న ఆరోపణలు వస్తేనే సస్పెన్షన్​ వేటు వేస్తున్న సమయంలో ఓ సీఐపై సీఎంతో పాటు జాతీయ కమిషన్ వరకు ఫిర్యాదులు వెళ్లడంతో పోలీసు ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారోనన్న చర్చ పోలీసు శాఖలో సాగుతోంది.