అక్షరటుడే, ఎల్లారెడ్డి : Nizam Sagar | నిజాంసాగర్ ప్రాజెక్ట్‌కు ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. ప్రస్తుతం జలాశయంలోకి 1,03,680 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో (Inflow) వస్తోంది. దీంతో అధికారులు గేట్లను ఎత్తి దిగువకు నీటి విడుదలను కొనసాగిస్తున్నారు.
సింగూరు నుంచి నీటి విడుదల కొనసాగుతుండటంతో నిజాంసాగర్‌కు (Nizam Sagar project ) భారీగా వరద పోటెత్తింది. 17 గేట్లు ఎత్తి అధికారులు 99,470 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ప్రధాన కాలువకు 900 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 1405 (17.8 టీఎంసీలు) అడుగులు కాగా.. ప్రస్తుతం 1400 (11.5 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉంది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో అధికారులు పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయడం లేదు.
Nizam Sagar | జలదిగ్బంధంలో ఏడుపాయల
మంజీర ఉధృతంగా ప్రవహిస్తుండటంతో నిజాంసాగర్ ఎగువన మెదక్ జిల్లాలో గల ఏడుపాయల దుర్గమ్మ ఆలయం (Edupayala Durgamma temple) జలదిగ్బంధంలోనే ఉంది. వనదుర్గా భవాని ఆలయం దాదాపు 15 రోజులుగా మూసి ఉంది. దీంతో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి రాజగోపురంలో పూజలు చేస్తున్నారు. శరన్నవరాత్రి వేడుకలు సైతం రాజగోపురంలోనే నిర్వహిస్తున్నారు.
కాగా సింగూరు నుంచి వరద భారీగా రావడంతో సోమవారం పాపన్నపేట మండలం ఎల్లాపూరు శివారులోని బ్రిడ్జి వద్ద మొసలి (crocodile) ప్రత్యక్షం అయింది. దీంతో స్థానికులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఎగువన మంజీర డ్యామ్‌లో మొసళ్లు ఉంటాయి. వరదకు అవి కొట్టుకు వచ్చినట్లు సమాచారం. మొసలిని చూసిన స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి దానిని బంధించారు.