అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nizamabad DCC | నిజామాబాద్ జిల్ల కాంగ్రెస్ అధ్యక్షుడిగా కాటిపల్లి నగేశ్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా బొబ్బిలి రామకృష్ణను అధిష్ఠానం ఇటీవల నియమించిన విషయం విదితమే.
కాగా, వీరిరువురు సోమవారం అట్టహాసంగా పదవీ ప్రమాణం చేశారు. అయితే ఈ సందర్భంగా కాంగ్రెస్ ముఖ్యనేతలు మాట్లాడిన తీరు విభేదాలను బహిర్గతం చేసింది.
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి షబ్బీర్ అలీ ఒకస్థాయిలో తన అసహనాన్ని వ్యక్తం చేశారు.
కాగా, ఇందుకు కారణాలు లేకపోలేదు. అర్బన్ బాధ్యుడిగా, సీనియర్ నేతగా, మైనార్టీ సీనియర్ నేతగా, ప్రభుత్వ సలహాదారుగా ఎంతో కీలకమైన బాధ్యతల్లో ఉన్న ఆయనకు వేదికపై తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని ఆయన మాటలను బట్టి అర్థం అవుతోంది.
Nizamabad DCC | ఆయన ఏమన్నారో పరిశీలిస్తే..
ఉమ్మడి జిల్లాలో దివంగత నేత డీఎస్ తర్వాత సీనియర్ అయినా.. ఫ్లెక్సీల విషయంలో కానీ, వేదికపై జరిగిన సన్మానంలో కానీ, తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. కేవలం పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డిని గజమాలలతో సన్మానించి.. పక్కనే ఉన్న షబ్బీర్ అలీని విస్మరించారు.
దీంతో అదే వేదికపై ఉన్న షబ్బీర్ అలీ విస్తుపోయి చూడటం తప్ప, ఏమీ చేయలేకపోయారు. సీనియర్ అయిన తనను పక్కనబెట్టి ఒక విధంగా అవమానించే విధంగా వ్యవహరించారని తన సన్నిహితులతో అన్నట్లు సమాచారం.
Nizamabad DCC | పది నిమిషాలకే వెనుదిరిగిన సుదర్శన్‌రెడ్డి..
మరో వైపు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు సుదర్శన్‌రెడ్డి ఈ సభలో పాల్గొన్నారు. కాగా, ఆయన మధ్యలోనే వెళ్లిపోయారు. పట్టుమని పది నిమిషాలు కూడా ఉండకుండా ముందుగానే తన ప్రసంగాన్ని ముగించుకుని వెళ్లిపోవడం గమనార్హం.
ఇదే అదనుగా ఆయన వెంటే వచ్చిన అనుచరగణంతోపాటు పార్టీ ద్వితీయ శ్రేణి గణం సభ కొనసాగుతుండగానే మధ్యలో నుంచి వెళ్లిపోయారు.
మరోవైపు రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఈ వేడుకకు హాజరు కాకపోవడంతో ఆయన అనుచరుణులు కానీ, రూరల్ ముఖ్యనేతలు కానీ వేడుకకు రాలేదు.
బయటపడ్డ సమన్వయలోపం
డీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నగేశ్‌రెడ్డి మొదటిరోజునే సమన్వయ లోపంతో వ్యవహరించినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. ప్రధానంగా ముఖ్య నేతలను లెక్క చేయకపోవడం విమర్శలకు తావిచ్చింది.
కేవలం తన అనుచర గణానికే మొదటి ప్రాధాన్యం ఇవ్వడం కళ్లకు కట్టినట్లు కనిపించింది. వీరి వ్యవహార శైలితో సీనియర్ నేత, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ అనిల్ ఈరవత్రి సైతం గైర్హాజరయ్యారు.
వీరికితోడు సీడ్ కార్పొరేషన్ ఛైర్మన్ అన్వేశ్‌రెడ్డి కూడా హాజరుకాలేదు. అన్వేశ్ వచ్చినట్లుగా వచ్చి.. ఆ వెంటనే వెనుదిరిగారు. కాగా, ఇంకోవైపు డీసీసీ పోటీలో నిలబడిన అభ్యర్థులు ఒక్కరు కూడా హాజరుకాకపోవడం గమనార్హం. వారికి చుట్టపు చూపుగానైనా పిలుపు అందలేదని సమాచారం.
ఇక నగర అధ్యక్ష రేసులో నిలిచిన రామర్తి గోపి, జిల్లా అధ్యక్ష పదవి ఆశించిన మార చంద్రమోహన్, మునిపల్లి సాయిరెడ్డి కార్యక్రమానికి రాకపోవడం గమనార్హం. అధిష్ఠానం తీసుకున్న నిర్ణయంతో వీరు తీవ్ర నైరాశ్యంలో ఉన్నట్లు తెలిసింది.
డీసీసీ పదవి దక్కించుకున్న నగేశ్‌రెడ్డి ఇలా ఆదిలోనే ఒంటెద్దు పోకడలకు పోవడం ఏమిటని ఆ పార్టీ నేతలే బహిరంగంగా విమర్శిస్తున్నారు.
