అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Nitin Nabin | బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ బాధ్యతలు స్వీకరించారు. జాతీయ ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఉదయం ఈ కార్యక్రమం చేపట్టారు.
న్యూఢిల్లీ (New Delhi)లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో బీజేపీ లాంఛనంగా నితిన్ నబిన్‌ను తమ కొత్త జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ (Prime Minister Modi), జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ సహా పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు, ఎంపీలు, నేతలు హాజరయ్యారు. బిహార్‌కు చెందిన 45 ఏళ్ల నబీన్ సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంస్థాగత ఎన్నికలకు బీజేపీ రిటర్నింగ్ అధికారి అయిన కె. లక్ష్మణ్, నితిన్ నబిన్‌కు ఎన్నికల ధృవపత్రాన్ని అందజేశారు.
Nitin Nabin | 45 ఏళ్ల వయసుల్లో
బీజేపీ జాతీయ అధ్యక్షుడి విషయంలో కొన్ని రోజులుగా ఉత్కంఠ నెలకొన్న విషయం తెలిసిందే. జేపీ నడ్డా (JP Nadda) పదవీకాలం అయిపోయినా.. ఎన్నికల కోసం పొడిగించారు. అనంతరం కొత్త అధ్యక్షుడి కోసం తీవ్రంగా కసరత్తు చేసి గత నెలలో నితిన్ నబిన్ పేరును ఖరారు చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన నామినేషన్ దాఖలు చేయగా.. మంగళవారం బాధ్యతలు చేపట్టారు. కాగా 45 ఏళ్ల వయసులోనే ఆయన జాతీయ అధ్యక్షుడు కావడం గమనార్హం. నబిన్ బీజేపీ 12వ జాతీయ అధ్యక్షుడయ్యారు. అతి చిన్న వయసులో బీజేపీ అధ్యక్ష పదవి చేపట్టిన వ్యక్తిగా నిలిచారు. గతంలో అమిత్ షా 49 ఏళ్ల వయసులో జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
Nitin Nabin | జెడ్ కేటగిరీ భద్రత
జాతీయ అధ్యక్షుడైన తర్వాత కేంద్ర ప్రభుత్వం (Central Government) నితిన్ నబిన్ జెడ్ కేటగిరీ భద్రతను మంజూరు చేసింది. మంగళవారం ఉదయం ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించే ముందు ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో, జేపీ నడ్డా ఇలాంటి కవరేజీని పొందారు. కాగా నబిన్ మే 23, 1980న పాట్నాలో జన్మించారు. ఆయన తండ్రి నవీన్ కిషోర్ సిన్హా బీజేపీ సీనియర్ నాయకుడిగా, ఎమ్మెల్యేగా పని చేశారు. తండ్రి మరణంతో నితిన్ నబిన్ రాజకీయాల్లోకి వచ్చారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇటీవల బీహార్ మంత్రిగా సైతం ప్రమాణం చేశారు. అయితే బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఆయన పేరును గత నెల14న ప్రకటించడంతో మంత్రి పదవికి రాజీనామా చేశారు.