అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy GGH | అనుమానాస్పద స్థితిలో నవజాత శిశువు మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా ఆస్పత్రిలో గురువారం చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
రామారెడ్డి మండలం (Ramareddy Mandal) రెడ్డిపేట గ్రామానికి చెందిన ఒగ్గు గంగాజమున పురిటి నొప్పులతో ఈనెల 19న ఆస్పత్రిలో చేరింది. 20న ఉదయం ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే పుట్టిన బిడ్డ బరువు తక్కువ ఉండడంతో పిల్లల వార్డులో చేర్చారు. బుధవారం బిడ్డను తల్లికి అప్పగించారు. అయితే గురువారం బిడ్డలో చలనం లేకపోవడంతో ప్రైవేట్ ఆస్పత్రికి (Private Hospital) తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దాంతో ప్రభుత్వ ఆస్పత్రిలో పిల్లల వైద్యులు సరిగ్గా పట్టించుకోకపోవడంతోనే బిడ్డ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
మరోవైపు ఆస్పత్రి వైద్యుల వాదన మరోలా ఉంది. పసి బిడ్డను తల్లి వద్ద ఉంచాల్సిన బంధువులు వాళ్లు పడుకున్న చోటే ఉంచడంతో రాత్రి పూట బిడ్డపై కాలు లేదా చేయి వేసి ఉండవచ్చని, అందుకే బాబు చనిపోయి ఉంటాడని తెలిపారు. అలాగే ఆస్పత్రి నుంచి తమకు కనీస సమాచారం ఇవ్వకుండా ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారని, ప్రైవేట్ ఆస్పత్రిలోనే బాబు మృతి చెంది ఉంటాడనే అనుమానం కూడా వ్యక్తం చేశారు. దాంతో నవజాత శిశువు మృతికి కారణాలు ఏమిటనేది స్పష్టంగా తెలియరాలేదు.