అక్షరటుడే, హైదరాబాద్: New Liquor Shops | రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ అమల్లోకి రావడంతో సోమవారం నుంచి తెలంగాణ Telangana వ్యాప్తంగా కొత్త మద్యం దుకాణాలు కార్యకలాపాలు ప్రారంభించాయి.
కొత్తగా లైసెన్సులు పొందిన నిర్వాహకులు దుకాణాలను అందంగా, ఆకర్షణీయంగా అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మకాలను ప్రారంభించారు. తొలి రోజే అనేక ప్రాంతాల్లో దుకాణాల వద్ద సందడి వాతావరణం కనిపించగా, అమ్మకాలు జోరుగా సాగాయి.
నిర్వాహకులు తమకు కలిసివచ్చే ముహూర్తం చూసుకుని మరీ షాపులు తెరిచి, విక్రయాలు మొదలుపెట్టడం అందరి దృష్టిని ఆకర్షించింది.
New Liquor Shops | వాకిన్ స్టోర్లు ఆకర్షణగా…
ఈసారి కొత్త పాలసీలో భాగంగా హైదరాబాద్‌తో పాటు పలు రాష్ట్ర, జిల్లా కేంద్రాల్లో ‘వాకిన్ స్టోర్లు’ ఏర్పాటు చేశారు. సూపర్ మార్కెట్ Super Market తరహాలో ఏర్పాటు చేసిన ఈ స్టోర్లలో వినియోగదారులు లోపలికి వెళ్లి తమకు నచ్చిన బ్రాండ్‌ను స్వయంగా ఎంచుకునే సౌకర్యం ఉంది.
లైసెన్సు ఫీజుతో పాటు అదనంగా రూ.5 లక్షలు చెల్లించిన వారికి ఈ అవకాశం లభించింది. నల్గొండలో ఐదు కొత్త వాకిన్ స్టోర్లు ప్రారంభమయ్యాయి. బెవరేజెస్ కార్పొరేషన్ డిపోల నుంచి ఆదివారం అర్ధరాత్రి దాకా సరకు రవాణా జరగడంతో తొలి రోజే తాజా స్టాక్‌తో విక్రయాలు ప్రారంభించగలిగారు.
Liquor వాకిన్ స్టోర్ల రూపంలో వచ్చిన ఈ మార్పులతో ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయం సమకూరే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది.
అయితే అన్ని ప్రాంతాల్లో దుకాణాల ప్రారంభం సాఫీగా సాగలేదు. ఆలయాలు, విద్యాసంస్థలు, నివాస ప్రాంతాలకు సమీపంలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. వారి నిరసనల కారణంగా కొన్ని దుకాణాలు ప్రారంభం కాలేదు.
అంతేకాక సరైన ప్రాంగణాలు అద్దెకు దొరకకపోవడంతో మరికొన్ని చోట్ల కార్యకలాపాలు వాయిదా పడ్డాయి. ప్రత్యేకంగా రంగారెడ్డి Ranga Reddy జిల్లా పరిధిలో 25కు పైగా దుకాణాలు తెరుచుకోలేదని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది.
కొత్త పాలసీ అమల్లోకి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా మద్యం విక్రయ వ్యవస్థలో వచ్చిన ఈ మార్పులపై వినియోగదారులు, నిర్వాహకులు మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
