అక్షరటుడే, వెబ్డెస్క్ : Cyclone Montha | తీవ్ర తుపానుగా మారిన ‘మొంథా’ ప్రభావం ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో (Nellore District) విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో జీవన విధానం దెబ్బతింది.
వాతావరణ శాఖ (Meteorological Department) జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేయడంతో అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉన్నారు. ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించే చర్యలు ప్రారంభమయ్యాయి. జిల్లాలోని 38 మండలాల్లో మొత్తం 142 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సగటున 3.7 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
Cyclone Montha | భారీ వర్షాలు..
పొదలకూరు మండలంలో (Podalakuru Mandal) అత్యధికంగా 16.6 మి.మీ. వర్షపాతం నమోదు చేసుకోగా, అనంతసాగరం మండలంలో కనిష్టంగా ఒక మి.మీ. మాత్రమే వర్షం కురిసింది. ఇంకా 10 మండలాల్లో ఎలాంటి వర్షపాతం నమోదుకాలేదని అధికారులు వివరించారు. సోమవారం మధ్యాహ్నం వరకు ఎండగా ఉన్న వాతావరణం (Weather), సాయంత్రానికి ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం మేఘావృతమై చల్లని గాలులు వీచడంతో వాతావరణం చల్లబడింది. మైపాడు, కృష్ణపట్నం, రామాయపట్నం తీరప్రాంతాల్లో సముద్రం ఉగ్రరూపం దాల్చింది. బలమైన ఈదురుగాలులతో భారీ అలలు ఎగిసిపడుతున్నాయి.
ఇదిలా ఉండగా.. ఎగువన ఉన్న కర్నూలు, వైఎస్సార్ కడప జిల్లాల నుంచి భారీగా వరదనీరు (Heavy Flood Water) చేరుతుండడంతో సోమశిల జలాశయం తన పూర్తిస్థాయి నీటిమట్టం 78 టీఎంసీల TMCలకు చేరువలో ఉంది. దీనివల్ల ముంపు ప్రమాదం తలెత్తకుండా అధికారులు ముందుజాగ్రత్తగా పెన్నా నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. జిల్లా పరిస్థితులపై ప్రత్యేక అధికారి యువరాజ్, కలెక్టర్ హిమాన్షు శుక్లా (Collector Himanshu Shukla) సమీక్ష సమావేశం నిర్వహించారు. తుపాను తీవ్రత దృష్ట్యా రక్షణ, సహాయక చర్యలను వేగవంతం చేయాలని అన్ని విభాగాల అధికారులను ఆదేశించారు. సముద్రతీర, లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను అవసరమైతే బలవంతంగానైనా పునరావాస కేంద్రాలకు తరలించాలనే ఆదేశాలు ఇచ్చారు.
కలెక్టర్ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ.. “తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అన్ని రకాల ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నాం. జిల్లాలో ఏర్పాటు చేసిన 144 పునరావాస కేంద్రాలు ఇప్పటికే పనిచేస్తున్నాయి అని తెలిపారు. కమ్యూనికేషన్ వ్యవస్థకు అంతరాయం కలగకుండా కలెక్టరేట్‌లో ప్రత్యేక సెల్ టవర్ ఏర్పాటు చేసినట్లు’’ వివరించారు.