అక్షరటుడే, వెబ్డెస్క్: Nayanthara | లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanatara) అంటే నటనతో పాటు ఆమె తీసుకునే నిర్ణయాలు కూడా ఇండస్ట్రీలో ప్రత్యేకంగా చర్చకు వస్తాయి. ముఖ్యంగా సినిమా ప్రచారాలకు (film promotions) దూరంగా ఉండాలన్న ఆమె స్టాండ్ గత దశాబ్దం కాలంగా అందరికీ తెలిసిందే.
భారీ పారితోషికాలు ఆఫర్ చేసినా, స్టార్ దర్శకులు ఒత్తిడి చేసినా.. ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననని చెప్పడంలో ఆమె ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు. నయనతార ఒక సినిమాకు కమిట్ అయితే షూటింగ్ పూర్తి చేయడమే తన బాధ్యతగా భావిస్తుంది. ఆ తర్వాత ఆడియో ఫంక్షన్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఇంటర్వ్యూలు వంటి వాటితో తనకు సంబంధం లేదని ముందుగానే కండిషన్ పెడుతుంది. ఈ షరతుకు నిర్మాతలు ఒప్పుకుంటేనే సినిమా సైన్ చేస్తుంది. అందుకే గత కొన్ని ఏళ్లుగా ఆమె సినిమాలకు విడుదల సమయంలో ప్రచార సందడి కనిపించకపోవడం సాధారణంగా మారింది.
Nayanthara | విమర్శల వర్షం..
అయితే తాజాగా వచ్చిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా విషయంలో ఈ నియమానికి స్వల్ప మినహాయింపు కనిపించింది. దర్శకుడు అనీల్ రావిపూడితో ఉన్న సన్నిహిత సంబంధం కారణంగా నయనతార రెండు ప్రమోషనల్ వీడియోల్లో పాల్గొంది. అంతేకాదు, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు కూడా ఆమె అందుబాటులో ఉంటే తప్పకుండా తీసుకొచ్చేవాడినని అనీల్ రావిపూడి బహిరంగంగా చెప్పడం మరింత ఆసక్తికరంగా మారింది. ఇదే ఇప్పుడు కోలీవుడ్‌లో (Kollywood) కొత్త చర్చకు కారణమైంది. తమిళ సినిమాలకు ప్రచారం చేయని నయనతార, తెలుగు సినిమా కోసం మాత్రం ముందుకు రావడంపై కొందరు దర్శకులు, నిర్మాతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. సోషల్ మీడియాలో కూడా ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. స్వభాష సినిమాల కంటే ఇతర భాషల సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుందా? అనే ప్రశ్నలు కొందరు లేవనెత్తుతున్నారు.
అయితే మరోవైపు నయనతారను సమర్థించే వర్గం కూడా ఉంది. ప్రచారం చేయాలా వద్దా అనేది పూర్తిగా ఆమె వ్యక్తిగత నిర్ణయమని, ఎవరూ ప్రశ్నించే అవసరం లేదని అంటున్నారు. పైగా ఆమె తన కెరీర్‌లో తానే ప్రధాన పాత్ర పోషించిన సినిమాలకైనా పెద్దగా ప్రచారం చేయలేదన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మొత్తంగా చూస్తే, నయనతార ఒక సినిమా కోసం తీసుకున్న చిన్న మినహాయింపే ఇప్పుడు రెండు పరిశ్రమల్లో (Industry) చర్చకు దారి తీసింది. ఈ విమర్శలపై ఆమె స్పందిస్తుందా? లేక ఎప్పటిలాగే మౌనమే కొనసాగిస్తుందా? అన్నది చూడాల్సి ఉంది.