అక్షరటుడే, వెబ్‌డెస్క్: NTR Death Anniversary | తెలుగుదేశం పార్టీ (Telugu Desam) వ్యవస్థాపకులు, తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో స్మృతి కార్యక్రమాలు నిర్వహించారు.
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ ఉదయం నుంచే సందడి నెలకొంది. అభిమానులు, పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఎన్టీఆర్‌కు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) పాల్గొని ఎన్టీఆర్ సమాధి వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ ఆశయాలు, ప్రజాసేవ పట్ల ఆయన చేసిన కృషిని లోకేశ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆయన వెంట టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొనడంతో ఘాట్ ప్రాంగణాం కిటకిటలాడింది.
NTR Death Anniversary | కుటుంబ సభ్యుల ప్రత్యేక నివాళులు
నందమూరి కుటుంబ సభ్యులు కూడా ఎన్టీఆర్ NTR ఘాట్‌ను సందర్శించి తమ తాతకు ఘనంగా అంజలి ఘటించారు. టాలీవుడ్ నటుడు కల్యాణ్ రామ్ (Kalyan Ram) తన కుటుంబ సభ్యులతో కలిసి ఘాట్ వద్ద నివాళులర్పించి, ఎన్టీఆర్ సినీ–రాజకీయ జీవితాన్ని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ (NTR Trust) ఆధ్వర్యంలో ఘాట్ పరిసరాలను పూల అలంకరణలతో అందంగా ముస్తాబు చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫోటో ఎగ్జిబిషన్ ఎన్టీఆర్ జీవితంలోని కీలక ఘట్టాలను ప్రతిబింబిస్తూ సందర్శకులను ఆకట్టుకుంది. నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయన సాధించిన విజయాలు, తెలుగు జాతికి అందించిన సేవలను ఈ ప్రదర్శన గుర్తు చేసింది. అయితే ఎప్పుడు కళ్యాణ్ రామ్‌తో కలిసి హాజరయ్యే జూనియర్ ఎన్టీఆర్ ఈ సారి కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అంతటా టీడీపీ శ్రేణులు పలు కార్యక్రమాలు చేపట్టాయి. వివిధ పట్టణాలు, గ్రామాల్లో ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించడంతో పాటు, సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. నేతలు ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) కూడా వర్ధంతి కార్యక్రమాల్లో భాగంగా ఉదయం పార్టీ కార్యాలయాన్ని సందర్శించనున్నారు. అనంతరం అంతర్జాతీయ పర్యటనలో భాగంగా సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుంచి స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు బయలుదేరనున్నారు.