అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bhuvanagiri | యాదాద్రి-భువనగిరి జిల్లాలోని బండ సోమారం గ్రామానికి చెందిన యువకుడు ప్రవీణ్ దక్షిణాఫ్రికాలో కిడ్నాప్‌కు గురైన ఘటన కలకలం రేపుతోంది. బోర్ వెల్ రిగ్ పరిశ్రమ (Bore Well Rig Industry)లో పని చేసేందుకు ఈ జిల్లా నుండి అనేక మంది విదేశాలకి వెళ్లి అక్కడే జీవినం సాగిస్తుంటారు.
వారిలో ప్రవీణ్ ఒకరు. హైదరాబాద్ (Hyderabad)కు చెందిన ఓ బోర్‌వెల్ కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న ప్రవీణ్ (నల్లమాస జంగయ్య, మహేశ్వరి దంపతుల చిన్న కుమారుడు) గత ఏడాది నవంబరులో కంపెనీ పనుల నిమిత్తం దక్షిణాఫ్రికా (South Africa)కు వెళ్లాడు. అక్కడ మాలి రాష్ట్రంలోని కోబ్రి ప్రాంతంలో బోరు యంత్రాల పనితీరును పర్యవేక్షించేవాడు.
Bhuvanagiri | ఉగ్రవాదుల చెరలో..
గత నెల 23న విధులు ముగించుకుని తన షెల్టర్‌కు వెళ్తుండగా, మార్గమధ్యలో జేఎన్‌ఐఎం (JNIM) ఉగ్రవాద గ్రూప్‌కు చెందిన వ్యక్తులు ప్రవీణ్‌ను కిడ్నాప్ చేసినట్లు సమాచారం. ఈ గ్రూప్ గతంలోనూ అదే ప్రాంతంలో విదేశీయులను అపహరించిన ఘటనలు ఉన్నాయి. ప్రతిరోజూ తల్లిదండ్రులతో మాట్లాడే ప్రవీణ్ ఆ రోజు నుండి ఫోన్‌కు స్పందించకపోవడంతో కుటుంబం ఆందోళనకు గురైంది. అదే సమయంలో రెండు రోజుల క్రితం కంపెనీ ప్రతినిధులు ఆయన కిడ్నాప్ విషయాన్ని కుటుంబానికి వెల్లడించడంతో ఆత్రుత మరింత పెరిగింది. కొడుకు ఆచూకీ తెలియక తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇదిలా ఉండగా బోర్‌వెల్ కంపెనీ ప్రతినిధులు భారత రాయబార కార్యాలయం (India Embassy)తో సంప్రదింపులు జరుపుతూ ప్రవీణ్‌ను క్షేమంగా బయటకు తీయడానికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిసింది.
ఈ సంఘటనతో గ్రామంలో కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రవీణ్ త్వరగా సురక్షితంగా తిరిగి రావాలని గ్రామస్తులు ప్రార్థిస్తున్నారు. ఇలాంటి ఘటనలు విన్న తర్వాత చాలా మంది విదేశాలకి వెళ్లాలంటే జంకుతున్నారు. విదేశాలకి వెళ్లిన సమయంలో కొందరు తూటాలకి కూడా బలవుతుండడం మనం చూస్తూనే ఉన్నాం.
