అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Nalgonda | నల్గొండలోని (Nalgonda) దారుణ హత్యాచార కేసులో జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పదేళ్ల క్రితం 12 ఏళ్ల బాలికపై జరిగిన హత్యాచారానికి సంబంధించిన ఈ కేసులో న్యాయస్థానం నిందితుడికి ఉరిశిక్ష విధించింది. ఈ తీర్పు సమాజానికి గట్టిగా సందేశం ఇస్తుందని న్యాయవర్గాలు భావిస్తున్నాయి. 2013లో నల్గొండకు చెందిన మోహమ్మద్ ముకర్రం అనే వ్యక్తి, తన ఇంట్లో ఒంటరిగా ఉన్న 12 ఏళ్ల బాలికను గమనించి, ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు. ఆమెపై అత్యంత దారుణంగా లైంగికదాడికి పాల్పడ్డాడు. అయితే బాలిక ఈ విషయాన్ని బయటపెడుతుందనే భయంతో హత్య చేశాడు. తన నేరాన్ని కప్పిపుచ్చేందుకు బాలిక మృతదేహాన్ని కాలువలో పడేశాడు.
Nalgonda | సంచలన తీర్పు..
పెద్ద ఎత్తున దుమారం రేపిన ఈ ఘటనపై నల్గొండ వన్‌టౌన్ పోలీసులు (Nalgonda One Town Police) స్పందించి ముకర్రంను అదుపులోకి తీసుకొని, పోక్సో చట్టం (POCSO Act), హత్య వంటి నేరాల కింద కేసులు నమోదు చేశారు. అప్పటి నుంచి ఈ కేసు పదేళ్ల పాటు నల్గొండ జిల్లా కోర్టులో విచారణ జరుగుతుంది. గత వాదనలు, సాక్ష్యాధారాలన్నింటినీ పరిశీలించిన నల్గొండ పోక్సో కోర్టు (POCSO Court) ఇన్‌ఛార్జి న్యాయమూర్తి రోజా రమణి (Judge Roja Ramani), నిందితుడు ముకర్రం చేసిన నేరం అత్యంత హేయనీయమైన చర్య అని పేర్కొంటూ ఉరిశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. అంతేకాదు, ముకర్రంకు రూ. 1.10 లక్షల జరిమానా కూడా విధించారు.
ఈ తీర్పుతో బాధిత కుటుంబానికి కొంత న్యాయం లభించినట్టయింది. నిందితుడికి అత్యంత కఠిన శిక్ష పడడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మైనర్లపై నేరాలు చేసే వారికి ఇది గట్టి హెచ్చరికగా నిలుస్తుందని అభిప్రాయపడుతున్నారు. తమ కూతురికి చివరకు న్యాయం జరిగిందని బాధిత కుటుంబం చెప్పుకొచ్చింది. “పదేళ్లుగా ఎదురుచూస్తున్నాం. ఈ తీర్పుతో కొంత ఉపశమనం కలిగింది. ఇలాంటి నేరాలపై ఇలానే కఠినంగా స్పందించాలి అని వారు భావోద్వేగంగా చెప్పారు. ఇలాంటి నేరాలకు ఉరిశిక్షలు, కఠిన శిక్షలు తప్పనిసరి అని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. ఇవి భవిష్యత్తులో ఇటువంటి దారుణాలను అడ్డగించడంలో కీలకంగా పనిచేస్తాయని అభిప్రాయపడుతున్నారు. ఇది న్యాయవ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచే తీర్పుగా నిలుస్తుందని చెబుతున్నారు.