అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Nalgonda | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నల్గొండ మున్సిపాలిటీ (Nalgonda Municipality)ని కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ చేసింది. ఈ మేరకు బుధవారం గెజిట్ విడుదల చేసింది.
రాష్ట్రంలో ఇప్పటి వరకు 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లు ఉండేవి. అయితే తాజాగా నల్గొండను అప్‌గ్రేడ్ చేయడంతో కార్పొరేషన్ల సంఖ్య 7కు చేరనుంది. హైదరాబాద్ (Hyderabad) మినహా నిజామాబాద్, కరీంనగర్, కొత్తగూడెం, వరంగల్, మంచిర్యాల, మహబూబ్‌నగర్ కార్పొరేషన్లు ఉన్నాయి. తాజాగా ఆ జాబితాలోకి నల్గొండ చేరింది. కాగా నల్గొండ బల్దియాను కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ చేస్తూ ఇటీవల శాసనసభ తీర్మానం చేసింది. తాజాగా ఇందుకు సంబంధించిన గెజిట్ విడుదల చేసింది. దీంతో ఇప్పటి వరకు స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్న నల్లగొండ మహానగరంగా మారనుంది. కార్పొరేషన్ కావడంతో ఛైర్మన్ స్థానంలో మేయర్, కౌన్సిలర్ల స్థానంలో కార్పొరేటర్ల ఎన్నిక నిర్వహించనున్నారు.
Nalgonda | గ్రామాల విలీనం లేకుండానే..
ప్రస్తుతం ఉన్న మున్సిపాలిటీల్లో నల్గొండలోనే అత్యధిక ఓటర్లు ఉన్నారు. పట్టణంలో ప్రస్తుతం 48 వార్డులు ఉన్నాయి. 2.25 లక్షల జనాభా ఉంది. దీంతో శివారు గ్రామాలను విలీనం చేయకుండానే కార్పొరేషన్‌గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పట్టణీకరణతో సుమారు 5 నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న పరిధిని తీసుకుని మహానగరంగా ఏర్పాటు చేయనున్నారు. దీంతో పట్టణ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో మున్సిపల్ ఎన్నికలు (Municipal elections) నిర్వహించనున్న నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.