అక్షరటుడే, హైదరాబాద్: Naini Coal Block Tender | సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) పరిధిలోని నైని బొగ్గు బ్లాక్ MDO (Mine Developer & Operator) టెండర్ రద్దు వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. దీనిపై విచారణకు ఒక సాంకేతిక బృందాన్ని ఏర్పాటు చేస్తూ కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికితోడు సంస్థ నిధుల దుర్వినియోగంపైనా విచారణకు ఆదేశించింది. విచారణను పూర్తి చేసి మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది.
బృందంలో కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ డైరెక్టర్ మారపల్లి వెంకటేశ్వర్లు, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ చేత్నా శుక్లా ఉన్నారు. గతేడాది నవంబర్ 28న విడుదలైన Notice Inviting Tender (NIT) ను ఈ బృందం లోతుగా విశ్లేషించాల్సి ఉంది. దీనికితోడు SCCL సంస్థ చేపట్టిన CSR (Corporate Social Responsibility) నిధుల దుర్వినియోగం, ఖర్చుల సరళిని నిబంధనలకు అనుగుణంగా ఉందా.. లేదా అనేది కూడా విచారించనుంది.
Naini Coal Block Tender | ఎన్నో అనుమానాలు..
కేంద్రం విడుదల చేసిన తాజా ఉత్తర్వులను పరిశీలిస్తే.. ఇది కేవలం టెండర్ రద్దుకే పరిమితం కాకుండా సింగరేణి మొత్తం పరిపాలనా విధానంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ అంశం అటు రాజకీయ వర్గాల్లో, ఇటు పారిశ్రామిక వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
CSR ఖర్చులపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పరిశీలనకు ఆదేశించడంతో “టెండర్ వ్యవహారానికి CSR కి సంబంధం ఏమిటి ” అనే ప్రశ్న తలెత్తుత్తోంది. మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలనే ఆదేశం కూడా అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఇటీవల అర్జెంటీనా అంతర్జాతీయ ఫుట్బాల్ ఆటగాడు మెస్సీ క్రీడా ఈవెంట్ కోసం రేవంత్ రెడ్డి రూ.10 కోట్ల సింగరేణి నిధులు వాడుకున్నట్లు ప్రచారంలో ఉంది. అంతే కాకుండా కొన్ని ప్రభుత్వ స్కీముల పేరుతో నిర్వహించిన కార్యక్రమాల కోసం కూడా సింగరేణి CSR నిధులు వినియోగించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే నిధుల వినియోగంపైనా విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. కాగా, విచారణ చేపట్టి 3 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించిన నేపథ్యంలో.. ఈ అంశాలపై కేంద్రానికి ముందే స్పష్టత ఉందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అసలే కేంద్రంలో ఒక ప్రభుత్వం, రాష్ట్రంలో మరో ప్రభుత్వం ఉండటంతో రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకారం లేకుండా పోయింది. కాగా, ఈ అంశం కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాల మధ్య దూరాన్ని మరింత పెంచబోతున్నట్లు తెలుస్తోంది.