అక్షరటుడే, వెబ్‌డెస్క్ : BC Reservations | వెనుకబడిన వర్గాలకు మళ్లీ నిరాశే మిగిలింది. రిజర్వేషన్ల అంశం తిరిగి మొదటికొచ్చింది. రాజకీయ పక్షాల సంకుచిత వైఖరి వల్ల బీసీలకు న్యాయం దక్కకుండా పోయింది. పార్టీలకు చిత్తశుద్ధి లోపించడంతో మళ్లీ అధికారం దూరమైంది. 42 శాతం రిజర్వేషన్లు కల్పించే జీవో నెం. 9పై హైకోర్టు స్టే విధించింది.
దీంతో స్థానిక ఎన్నికల (Local Body Elections) ప్రక్రియ నిలిచిపోయింది. ఎన్నికల్లో నిలిచి గెలిచి సత్తా చాటాలనుకున్న బీసీ నేతల ఉత్సాహం అడుగంటింది. చివరకు రాజకీయ చదరంగంలో వెనుకబడిన వర్గాలు పావులుగా మారాయి. బీసీలను ఓటు బ్యాంకుగా మార్చుకున్న పార్టీలు మరోసారి అన్యాయం చేశాయి. సామాజిక న్యాయం చేయడంలో సామూహికంగా వైఫల్యం చెందాయి. పైగా హైకోర్టు రిజర్వేషన్ జీవోపై స్టే విధిస్తే న్యాయ పోరాటం చేయాల్సిన రాజకీయ పార్టీలు.. రోడ్డున పడి పరస్పర నిందాపరణలు చేసుకుంటున్నాయి. మీరంటే మీరేనంటూ విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నాయి.
BC Reservations | అన్ని పార్టీలదీ అదే తీరు..
బీసీలకు సామాజిక న్యాయం చేయడంలో ఏ పార్టీకీ సరైన చిత్తశుద్ధి లేకుండా పోయింది. ఓట్ల కోసం తప్పితే బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించాలన్న వైఖరి కరువైంది. మూడు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ బీసీలకు అన్యాయం చేశాయి. చేస్తూనే ఉన్నాయి. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని చెప్పడం తప్పితే అమలు కోసం ప్రయత్నాలు కరువయ్యాయి. అధికార పార్టీతో పాటు విపక్షాలు సైతం అదే వైఖరి ఎంచుకోవడంతో వెనుకబడిన వర్గాలు వెనుకబడే ఉంటున్నాయి తప్పితే ముందడుగు వేయడం లేదు. చివరకు కాంగ్రెస్ ఏదో ప్రయత్నం చేసినప్పటికీ, చట్టబద్ధంగా, నిబంధనల ప్రకారం లేకపోవడం మూలంగా ఆ ప్రయత్నం విఫలమైంది. పార్టీలకు చిత్తశుద్ధి లేకపోవడం, ఎవరికి వారే రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించడంతో కోర్టులో బీసీల జీవోకు చుక్కెదురైంది.
BC Reservations | కాంగ్రెస్ వైఫల్యం..
రిజర్వేషన్లపై అధికార కాంగ్రెస్ పార్టీ (Congress Party) బీసీలకు ఆశ చూపి చివరకు నిరాశే మిగిల్చింది. రిజర్వేషన్లు పెంచేందుకు అన్ని ప్రయత్నాలు చేసినట్లు చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ తొలి అడుగు వేయడమే తప్పుగా వేసింది. రిజర్వేషన్ల పెంపు అనేది రాజ్యాంగ సవరణతో కూడుకున్న అంశం. కేంద్ర సహకారం లేనిదే అది సాధ్యం కాదని తెలిసీ కాంగ్రెస్ పార్టీ 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మాట ఇచ్చింది. కేంద్రంతో సఖ్యతగా వ్యవహరించో, లేక పోరాటం చేసో సాధించుకోవాల్సింది పోయి ఒంటెద్దు పోకడలకు పోయింది. ఫలితంగా అసెంబ్లీలో ఆమోదించిన బిల్లు, మంత్రిమండలి పర్మిషన్తో తీసుకొచ్చిన ఆర్డినెన్సుకు గవర్నర్ ఆమోద ముద్ర పడలేదు.
ఇక తప్పనిసరి పరిస్థితుల్లో రిజర్వేషన్లు పెంచుతూ జీవో తీసుకొచ్చింది. వాస్తవానికి అది కోర్టుల్లో నిలబడదని తెలిసీ అధికార పార్టీ జీవో అనే ఆయుధాన్ని ప్రయోగించింది. చివరకు ఆ పార్టీ కోరుకున్నదే జరిగింది. జీవో 9పై హైకోర్టు విధించింది. బీసీలకు రిజర్వేషన్లు (BC Reservations) ఇచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, కోర్టు అంగీకరించలేదని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ.. అన్ని తెలిసే ఇక్కడి దాకా తీసుకొచ్చింది. రిజర్వేషన్లు 50 శాతానికి మించితే కోర్టులు కొట్టేస్తాయని తెలిసీ కామారెడ్డి డిక్లరేషన్‌లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు హామీ ఇచ్చింది. అసెంబ్లీలో బిల్లు, ఆర్డినెన్స్, జీవో తీసుకొచ్చి ఇంతదూరం లాక్కొచ్చి, బీసీలకు ఆశలు కల్పించి, చివరకు చేతులెత్తేసింది.
2018లో బీఆర్ఎస్ తెచ్చిన చట్టం ఓబీసీలకు గుదిబండగా మారిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అదే సమయంలో బిల్లుతో పాటు ఆర్డినెన్స్‌ను గవర్నర్ ఆమోదించకుండా కేంద్రంలోని బీజేపీ అడ్డుకుంటోందని విమర్శించింది. కేంద్రాన్ని ఒప్పించి మెప్పించి రిజర్వేషన్లను సాధించుకోవాల్సిన కాంగ్రెస్ పార్టీ.. ఇతరులపై నెపం నెట్టి తప్పించుకోవాలని చూస్తుండడంపై బీసీ సంఘాలు (BC Associations) మండిపడుతున్నాయి.
BC Reservations | బీఆర్ఎస్ ది మరోదారి..
ఇక, బీసీల విషయంలో బీఆర్ఎస్ పార్టీ తీరు మరోలా ఉంది. ఉద్యమ పార్టీకి మొదటి నుంచి బీసీల పట్ల చిత్తశుద్ధి లేకుండా పోయింది. గులాబీ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో తీసుకొచ్చిన చట్టం ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల పెంపునకు ప్రతిబంధకంగా మారింది. పంచాయతీరాజ్ (సవరణ) చట్టం తీసుకొచ్చిన సమయంలో రిజర్వేషన్లు 50 శాతానికి మించొద్దని స్పష్టంగా పేర్కొన్నారు. ఇప్పుడిదే అంశం గుదిబండగా మారింది. మరోవైపు, అసెంబ్లీలో బీసీ బిల్లుకు మద్దతిచ్చిన బీఆర్ఎస్.. అది ఆమోదం పొందే వరకూ ప్రభుత్వంతో కలిసి నడవాల్సింది పోయి మధ్యలోనే వదిలేసింది.
కేంద్రం వద్దకు వెళ్దామని, ఢిల్లీలో ధర్నా చేద్దామని కాంగ్రెస్ పిలుపునిస్తే ఖాతరు చేయలేదు. అంతెందుకు కుల గణనలోనే ఆ పార్టీ ముఖ నేతలు పాల్గొనలేదు. అధినేత కేసీఆర్(KCR), వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), హరీశ్ రావు(Harish Rao) వంటి వారు కుల గణనకు దూరంగా ఉండిపోయారు. ఇప్పుడేమో జీవోపై కోర్టు స్టే విధించడంతో గులాబీ నేతలు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఆరు గ్యారంటీల తరహాలోనే 42శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ డ్రామాలు ఆడుతోందని ఆరోపిస్తున్నారు. 55 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉండి కాంగ్రెస్ ఏనాడైనా బీసీ రిజర్వేషన్ల కోసం పాటు పడిందా? చిత్తశుద్ధి ఉంటే జాతీయ నాయకులతో ఢిల్లీ వేదికగా పోరాటం చేయాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేస్తోంది. ఢిల్లీలో ధర్నా చేస్తే వెళ్లని ఉద్యమ పార్టీ.. ఇప్పుడు యుద్ధభేరి మోగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతుండడం వైచిత్రి.
BC Reservations | ముస్లింల పేరిట బీజేపీ..
ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన విషయంలో అంటీ ముట్టనట్లుగానే వ్యవహరించింది. వాస్తవానికి బీజేపీ ఎప్పటి నుంచో రిజర్వేషన్లకు వ్యతిరేక వైఖరితోనే ఉంది. ఇక, తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు సంబంధించిన అసెంబ్లీలో మద్దతు ఇచ్చిన బీజేపీ.. మెలిక పెట్టింది. ముస్లింలను కలుపకుండా బీసీలకే 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఫిటింగ్ పెట్టింది. 42 శాతంలో ముస్లింలను కలపడం వల్ల వారికే ప్రయోజనం చేకూరుతుందన్నది బీజేపీ వాదన. అందుకే బిల్లుతో పాటు ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం తెలుపకుండా అడ్డుపుల్ల వేయించింది.
ఇక, రిజర్వేషన్లు 50 శాతానికి మించొద్దన్న సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో.. బీసీలకు న్యాయం చేయలాంటే 9వ షెడ్యూల్ లో చేర్చాలి. ఆ దిశగా కాంగ్రెస్ ఒత్తిడి తేకపోవడంతో బీజేపీ కూడా పట్టించుకోలేదు. వెనుకబడిన వర్గాలకు తామే న్యాయం చేశామని చెప్పుకునే బీజేపీకి.. తాజా పరిణామాల్లో కీలక పాత్ర పోషించింది. గవర్నర్ బీసీ బిల్లుకు ఆమోదం తెలిపి ఉంటే పరిస్థితి ఇక్కడి దాకా వచ్చేది కాదని బీసీ వర్గాలు మండిపడుతున్నాయి. అన్ని పార్టీలు కలిసి తమను మరోసారి మోసగించాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.