అక్షరటుడే, కామారెడ్డి: Shabbir Ali | రాబోయే మున్సిపల్ ఎన్నికలు కామారెడ్డి భవిష్యత్తును నిర్ణయిస్తాయని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Government Advisor Shabbir Ali) అన్నారు. పట్టణంలోని 20, 21, 22, 23 వార్డుల్లో నిర్మించ తలపెట్టిన సీసీ రోడ్లు, డ్రెయినేజీ, ఇతర అభివృద్ధి పనులకు మంగళవారం శంకుస్థాపన చేశారు.
Shabbir Ali | నాలుగు వార్డుల్లో..
ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడతూ.. నాలుగు వార్డుల్లో రూ.80 లక్షలతో పనులు చేపట్టడం సంతోషాన్నిస్తోందన్నారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని, కామారెడ్డి పట్టణాన్ని (Kamareddy town) ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. తాము మాటలు చెప్పేవాళ్లం కాదని, పనులు చేసి చూపేవాళ్లమని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన వార్డులను ప్రస్తుతం ప్రగతి బాట పట్టిస్తున్నామని పేర్కొన్నారు.
బురద రోడ్లు పోయి సిమెంట్ రోడ్లు వస్తున్నాయని, మురికి నీటి సమస్య పోయి పక్కా డ్రెయినేజీలు వస్తున్నాయన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) కాంగ్రెస్ గెలుపు కామారెడ్డి మలుపు అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇచ్చే ప్రతి ఓటు కామారెడ్డి అభివృద్ధికి వేసే పునాది అన్నారు. ప్రభుత్వం చేస్తున్న ఈ అభివృద్ధి, తమ నిబద్ధతను చూసి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించాలని ఆయన కోరారు. మున్సిపల్ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే తమ తదుపరి లక్ష్యమన్నారు.