అక్షరటుడే, హైదరాబాద్: municipal elections notification | తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి నెలలో మొదటి వారంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ఉండబోతోంది. ఈ నేపథ్యంలో సంక్రాంతి పండుగ తర్వాత ఎప్పుడైనా అంటే.. జనవరి 16వ తేదీ నుంచి ఎప్పుడైనా మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్ల పాలక వర్గాల ఎన్నికను చేపట్టాల్సి ఉంది.
Municipal Elections Notification | మహిళలే అధికం..
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే తుది ఓటర్ల జాబితాను వెల్లడించింది. ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 52,43,023 (25,62,369 మంది పురుషులు, 26,80,014 మంది మహిళలు, 640 మంది ట్రాన్స్ జెండర్స్) మంది ఓటర్లు ఉన్నారు. ఇక పట్టణ స్థానిక సంస్థల్లో ఓటర్ల విషయానికి వస్తే.. పురుషుల కంటే మహిళలే అధికంగా ఉన్నారు.
Municipal Elections Notification | నిజామాబాద్‌లో అత్యధికం..
నిజామాబాద్ కార్పొరేషన్లో ఓటర్ల సంఖ్య అత్యధికంగా ఉంది. ఇక్కడ 3,48,051 మంది ఓటర్లు ఉండటం గమనార్హం. కాగా అత్యల్పంగా కొత్తగూడెం కార్పొరేషన్లో ఉన్నారు. ఈ కార్పొరేషన్లో కేవలం 1,34,775 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. ఇక మున్సిపాలిటీల విషయానికి వస్తే.. ఆదిలాబాద్‌లో అత్యధికంగా 1,43,655 మంది ఓటర్లు ఉన్నారు. అత్యల్పంగా అమరచింత మున్సిపాలిటీ (9,147 మంది ఓటర్లు) లో ఉన్నారు.
Municipal Elections Notification | రిజర్వేషన్ల సంగతి ఏమిటి..?
నోటిఫికేషన్‌కు ముందు రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంది. జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్ల ప్రక్రియ చేపట్టాలి. కానీ, ఇప్పటికీ ఈ ప్రకియ చేపట్టలేదు. దీంతో పాత రిజర్వేషన్ల ప్రకారమే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.
మొత్తం ఎన్నికల పర్వంలో రిజర్వేషన్ల ప్రక్రియ అత్యంత కీలకం కావడంతో అధికారులు దీనిని సకాలంలో పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో గడువు ముగిసిన 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్ల ఎన్నికలకు రంగం సిద్ధమైన సంగతి తెలిసిందే.