అక్షరటుడే, ఇందూరు: Nizamabad Collector | దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) అన్నారు. ప్రభుత్వ తోడ్పాటును సద్వినియోగం చేసుకుంటూ అన్ని రంగాల్లో విజయం సాధించాలన్నారు. జిల్లా మహిళా శిశు దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో (Rajiv Gandhi Auditorium) అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్య, రాజకీయ రంగాలతో పాటు క్రీడలు, ఉన్నత ఉద్యోగాలు, వ్యాపారాలు ఇలా అన్ని రంగాల్లో దివ్యాంగులు ప్రతిభను చాటుతున్నారని కొనియాడారు.
Nizamabad Collector | దివ్యాంగుల కోసం పథకాల అమలు
ప్రభుత్వం దివ్యాంగుల కోసం పలు పథకాలను అమలు చేస్తోందని వివరించారు. దివ్యాంగులను వివాహం చేసుకున్న వారికి లక్ష రూపాయల ప్రోత్సాహం అందిస్తుందని గుర్తు చేశారు. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల కోసం భవిత కేంద్రాలను అన్ని వసతులతో కొనసాగిస్తున్నామన్నారు. అలాగే నగరంలో దివ్యాంగుల కోసం వసతిగృహాన్ని ఏర్పాటు చేశామని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Nizamabad Collector | సంక్షేమ పథకాల్లో సముచిత ప్రాధాన్యం
సంక్షేమ పథకాలు (welfare schemes), ఉద్యోగ నియామకాల్లో దివ్యాంగులకు సముచిత ప్రాధాన్యత కల్పించేందుకు కృషి చేస్తామని కలెక్టర్ భరోసా కల్పించారు. స్వచ్ఛంద సంస్థలు కూడా దివ్యాంగులకు సహకారం అందించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
అనంతరం చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు (cultural programs), గీతాలాపన ఆహుతులను ఎంతగానో ఆకట్టుకుంది. క్రీడా పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. అలాగే మెప్మా ఆధ్వర్యంలో దివ్యాంగుల సంఘాలకు రూ.12.5 లక్షల విలువ చేసే చెక్కును అందజేశారు. కార్యక్రమంలో సెర్ప్ రాష్ట్ర డైరెక్టర్ కృష్ణమూర్తి, జిల్లా సంక్షేమ అధికారిణి రసూల్బీ, డీఎంహెచ్వో డాక్టర్ రాజశ్రీ, మహిళా సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులు హేమలత, మమత, సైకియాట్రిస్ట్ డాక్టర్ రవితేజ, స్వచ్చంద సంస్థల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
