Homeఆంధప్రదేశ్Hidma Encounter | బలగాలకు మోస్ట్​ వాంటెడ్​.. కీలక దాడులకు నేతృత్వం

Hidma Encounter | బలగాలకు మోస్ట్​ వాంటెడ్​.. కీలక దాడులకు నేతృత్వం

బలగాలకు మోస్ట్​ వాంటెడ్​గా మారిన హిడ్మా మృతితో మావోయిస్ట్​ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. అనేక దాడుల్లో కీలకంగా వ్యవహరించిన హిడ్మాను హతమార్చడంతో బలగాలు భారీ విజయం సాధించాయి.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hidma Encounter | మావోయిస్ట్​ అగ్రనేత, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మడవి హిడ్మా (Madavi Hidma) ఎన్​కౌంటర్​లో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్​లోని అల్లూరి సీతారామరాజు జిల్లా (​​Alluri Seetharamaraju district) మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం జరిగిన కాల్పుల్లో హిడ్మాతో పాటు మరో ఐదుగురు మృతి చెందారు.

హిడ్మా ఛత్తీస్​గఢ్​లోని (Chhattisgarh) సుక్మా జిల్లా పువర్తి గ్రామంలో జన్మించాడు. మావోయిస్ట్​ ఉద్యమానికి ఆకర్షితుడై అడవి బాట పట్టాడు. అంచెలంచెలుగా కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగాడు. బస్తర్ నుంచి కేంద్ర కమిటీ సభ్యుడు అయిన ఏకైక వ్యక్తి ఆయనే కావడం గమనార్హం. భారీ ఆయుధాలు కలిగిన 350 మంది సభ్యుల బెటాలియన్​కు ప్రస్తుతం కమాండర్​గా ఉన్నాడు. ఆయనకు మూడంచెల భద్రత ఉంటుంది. బలగాలకు దొరకకుండా తప్పించుకోవడంలో ఆయన దిట్ట. గతంలో అనేకసార్లు కేంద్ర బలగాలు, పోలీసులు (central forces and police) హిడ్మా కోసం కూంబింగ్​ చేపట్టిన దొరకలేదు. అనేక ఎన్​కౌంటర్ల నుంచి తప్పించుకున్నాడు. తాజాగా ఆయన ఏపీలో ఎన్​కౌంటర్​లో చనిపోయారు.

Hidma Encounter | 25 ఏళ్లుగా అజ్ఞాతంలో..

హిడ్మా 25 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్నాడు. అనేక దాడులకు స్కెచ్​ వేశాడు. 26 దాడుల్లో హిడ్మా కీలక నిందితుడిగా ఉన్నాడు. 2007 సుక్మా జిల్లాలో (Sukma district) సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై దాడి చేసి, హతమార్చారు. 2010లో తడ్‌మెట్ల మెరుపు దాడిలో 76 మంది జవాన్లు చనిపోయారు. 2013లో జీరామ్‌ఘాటీ వద్ద కాంగ్రెస్‌ నేతల ఊచకోత ఘటనలో హిడ్మా కీలక పాత్ర పోషించాడు. 2017 సుక్మా జిల్లాలో 27 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లను మావోయిస్టులు హతమార్చారు. 2021 ఏప్రిల్‌ 4న బీజాపూర్‌ జిల్లా తరెంలో హిడ్మా వ్యూహంలో చిక్కుకుని 23 మంది జవాన్లు చనిపోయారు. దీంతో బలగాలకు ఆయన మోస్ట్​ వాంటెడ్​ అయిపోయాడు. ఆయన కోసం అనేక ఆపరేషన్లు చేపట్టినా.. చిక్కలేదు.

Hidma Encounter | రూ.కోటి రివార్డు

ఛత్తీస్​గఢ్​కు చెందిన హిడ్మా మావోయిస్టు పార్టీలో కీలక వ్యక్తి. అనేక దాడుల్లో ఆయన నేరుగా పాల్గొన్నాడు. అతడిపై రూ.కోటి రివార్డు ఉంది. జిరామ్ లోయ దాడి తర్వాత ఆయన పేరు మొదటగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అనంతరం అనేక దాడులకు నాయకత్వం వహించాడు. దీంతో అతడి కోసం ఏళ్లుగా బలగాలు, ప్రభుత్వాలు గాలిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్​ కగార్​ (Operation Kagar) చేపట్టిన తర్వాత అనేక మంది మావోయిస్టులు ఎన్​కౌంటర్లలో చనిపోయారు. చాలా మంది లొంగిపోయారు.

అయితే హిడ్మా జాడ మాత్రం ఇన్ని రోజులు చిక్కలేదు. ఇటీవల బలగాలు హిడ్మా కర్రెగుట్టల్లో ఉన్నాడనే సమాచారంతో కూంబింగ్​ చేపట్టాయి. ఈ క్రమంలో ఆయన ఏపీ, తెలంగాణ, ఛత్తీస్​గఢ్​ సరిహద్దులోని అటవీ ప్రాంతానికి మకాం మార్చినట్లు సమాచారం. మావోయిస్టు అగ్ర నేతలు షెల్టర్ తీసుకున్నారనే విశ్వసనీయ సమాచారంతో పోలీసులు కూంబింగ్​ చేపట్టారు. ఈ క్రమంలో ఎన్​కౌంటర్​ చోటు చేసుకోగా ఆరుగురు మృతి చెందారు.

Hidma Encounter | కీలక నేతలు

తాజాగా జరిగిన ఎన్​కౌంటర్​లో హిడ్మాతో పాటు పలువురు కీలక నేతలు హతం అయినట్లు తెలుస్తోంది. హిడ్మా భార్య హేమ సైతం మరణించింది. ఆమెపై రూ.50 లక్షల రివార్డు ఉంది. మరో సీనియర్​ నాయకుడు సైతం మృతి చెందినట్లు తెలుస్తోంది.

Hidma Encounter | సంక్షోభంలో మావోయిస్ట్​ పార్టీ

ఆపరేషన్​ కగార్​తో మావోయిస్ట్​ పార్టీ కకావికలం అయింది. దేశంలో మర్చి 31 నాటికి మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు బలగాలు భారీ విజయాలు సాధిస్తున్నాయి. గతంలో మావోయిస్ట్​ కేంద్ర కమిటీ అధ్యక్షుడు నంబాల కేశవరావు (Nambala Keshav Rao) ఎన్​కౌంటర్​లో హతం అయిన విషయం తెలిసిందే. అనంతరం పలువురు కీలక నేతలు సైతం మృతి చెందారు. చాలా మంది అడువలను వీడి లొంగిపోతున్నారు. ఈ క్రమంలో మావోయిస్ట్​ ఉద్యమంలో చీలిక రావడంతో కేంద్ర కమిటీ సభ్యులు మల్లోజుల వేణుగోపాల్​, ఆశన్న తమ అనుచరులతో ఇటీవల లొంగిపోయిన విషయం తెలిసిందే. తాజాగా హిడ్మా ఎన్​కౌంటర్​తో మావోయిస్ట్​ పార్టీ పని ఇక అయిపోయినట్లేనని పలువురు భావిస్తున్నారు.