అక్షరటుడే, వెబ్‌డెస్క్ : E-Passport | పాస్‌పోర్ట్(Passport)కు మరింత భద్రత కల్పించేందుకు మన విదేశాంగ శాఖ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే గతేడాది ఏప్రిల్‌లో పాస్‌పోర్ట్ సేవా ప్రోగ్రాం(Passport sewa program) 2.0ను ప్రారంభించిన విషయం తెలిసింది. తాజాగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఎలక్ట్రానిక్ పాస్‌పోర్ట్‌ను ప్రవేశపెట్టింది.
E-Passport | ఈ-పాస్‌పోర్ట్ అంటే..
ప్రస్తుతం పాస్‌పోర్ట్‌లు పేపర్ ప్రింటింగ్‌తో అందుబాటులో ఉన్నాయి. కొత్తగా ప్రవేశపెట్టిన ఈ-పాస్‌పోర్ట్(e-Passport)లలో పేపర్‌తోపాటు అడ్వాన్స్‌డ్ ఎలక్ట్రానిక్ ఫీచర్లతో కూడిన చిప్(Chip) కూడా ఉంటుంది. ఈ చిప్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్(ఆర్‌ఎఫ్‌ఐడీ) చిప్‌తోపాటు ఆంటెన్నాను కలిగి ఉంటుంది. చిప్‌లో బయోమెట్రిక్(Biometric) వివరాలూ ఉంటాయి. పాస్‌పోర్ట్ బుక్‌లెట్‌లో ఇవి అమరి ఉంటాయి. చిప్‌లోని డాటా(Data) దుర్వినియోగం కాకుండా పీకేఐ(పబ్లిక్ కీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్) వ్యవస్థ రక్షణనిస్తుంది. పాస్‌పోర్ట్‌లోని బయోమెట్రిక్, పర్సనల్ డాటాను ధ్రువీకరిస్తుంది. పాస్‌పోర్ట్ బుక్‌లెట్ ముందువైపున్న కవర్‌లో చిన్న గోల్డ్ కలర్ గుర్తుంటుంది. దీని ఆధారంగా ఈ-పాస్‌పోర్ట్‌ను గుర్తించవచ్చు. కొత్త పాస్‌పోర్ట్‌లో డ్యుయల్ లేయర్ సెక్యూరిటీ ఫీచర్లుంటాయి. దీంతో నకిలీవి తయారు చేయడం, ట్యాంపర్ చేయడం అంత సులువు కాదని అధికారులు పేర్కొంటున్నారు.
E-Passport | ఎంపిక చేసిన నగరాల్లోనే..
ఈ-పాస్‌పోర్ట్‌లను ప్రయోగాత్మకంగా ఎంపిక చేసిన నగరాలలోనే అందిస్తున్నారు. ఇందులో హైదరాబాద్(Hyderabad)తోపాటు ఢిల్లీ, చెన్నై, భువనేశ్వర్, గోవా, జైపూర్, జమ్మూ, అమృత్‌సర్, నాగ్‌పూర్, సూరత్, సిమ్లా, రాయ్‌పూర్, రాంచీ వంటి నగరాలున్నాయి. త్వరలోనే దేశవ్యాప్తంగా ఈ-పాస్‌పోర్ట్‌లు అందించడానికి విదేశాంగ శాఖ చర్యలు తీసుకుంటోంది. కాగా ఈ-పాస్‌పోర్ట్ తప్పనిసరి కాదు. కొత్తవి మాత్రం ఈ-పాస్‌పోర్ట్‌లు జారీ చేస్తారు. ప్రస్తుతం ఉన్నవాటిని గడువు ముగిసేవరకు వినియోగించుకోవచ్చు.
E-Passport | దరఖాస్తు ఇలా..
- ఆన్‌లైన్(Online)లో పాస్‌పోర్ట్ సేవా ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా లేదా ఎంపాస్‌పోర్ట్ సేవా యాప్(mPassport Seva app) ద్వారా ఈ-పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఎంపిక చేసిన పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు, ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయాల ద్వారా కూడా ఈ-పాస్‌పోర్ట్ పొందవచ్చు.
- ముందుగా ఆన్‌లైన్ పోర్టల్(Online Protal)లో రిజిస్టర్ చేసుకోవాలి. అనంతరం రిజిస్టర్డ్ ఐడీతో లాగిన్ కావాలి.
- కొత్త పాస్‌పోర్ట్ కోసమైతే అప్లయ్ ఫర్ ఫ్రెష్(Fresh) అని, ఇప్పటికే ఉన్నవారు రీ ఇష్యూ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.
- అపాయింట్‌మెంట్ తీసుకుని, ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు ఫీజు చెల్లించాలి. నిర్ణీత తేదీన ఎంచుకున్న పాస్‌పోర్ట్ కార్యాలయానికి వెళ్లి ఒరిజినల్ డాక్యుమెంట్లు చూపించాలి.