అక్షరటుడే, వెబ్‌డెస్క్ : PM Modi | గాజా శాంతి ఒప్పందంలో భాగంగా హమాస్ 20 మంది బందీలను విడుదల చేయడాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) స్వాగతించారు. అలాగే శాంతి ఒప్పందం కుదర్చడంలో కీలకంగా వ్యహరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump)పై ప్రశంసలు కురిపించారు. బందీల విడుదల ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Israeli Prime Minister Benjamin Netanyahu) అచంచలమై, బలమైన సంకల్పానికి నిదర్శనమని అభివర్ణించారు.
ట్రంప్ ఇటీవల ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళిక తొలి దశలో భాగంగా ఇజ్రాయిల్, హమాస్ (Israel and Hamas) కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రెండేళ్లకు పైగా హమాస్ చెరలో ఉన్న 20 మంది ఇజ్రాయిలీలను హమాస్ సోమవారం విడుదల చేసింది. ఈ మేరకు గాజాలోని మూడు ప్రాంతాల్లో బందీలను రెడ్ క్రాస్‌కు అప్పగించింది. ఇందుకు ప్రతిగా ఇజ్రాయిల్ కూడా దాదాపు రెండు వేల మంది పాలస్తీనియన్లను విడుదల చేసేందుకు అంగీకరించింది.
PM Modi | శాంతి ప్రయత్నాలకు భారత్ మద్దతు..
తాజా పరిణామాలను ప్రధాని మోదీ స్వాగతించారు. శాంతిని తిరిగి నెలకొల్పేందుకు భారత్ మద్దతు ఎల్లవేళలా ఉంటుందని చెప్పారు. ఈ ప్రాంతంలో శాంతిని తీసుకు రావడానికి నిజాయితీ గల ప్రయత్నాలను భారతదేశం పూర్తిగా సమర్థిస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో ఓ పోస్టు పెట్టారు. “రెండు సంవత్సరాల నిర్బంధం తర్వాత బందీలను విడుదల చేయడాన్ని స్వాగతిస్తున్నాము. బాధితుల కుటుంబాల ధైర్యానికి, అధ్యక్షుడు ట్రంప్ అచంచలమైన శాంతి ప్రయత్నాలకు, ప్రధాన మంత్రి నెతన్యాహు దృఢ సంకల్పానికి బందీల స్వేచ్ఛ ప్రతిరూపంగా నిలుస్తుంది. ఈ ప్రాంతంలో శాంతిని తీసుకురావడానికి అధ్యక్షుడు ట్రంప్ నిజాయితీగా చేసే ప్రయత్నాలకు మేము మద్దతు ఇస్తున్నామని” మోదీ పోస్టు చేశారు.