అక్షరటుడే, వెబ్‌డెస్క్: Congress Party | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత జాతి గౌరవాన్ని దెబ్బ తీశారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఇండియా, పాకిస్తాన్ వివాదంలో తాను మధ్యవర్తిత్వం వహించి యుద్ధాన్ని ఆపానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజాగా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ మరోసారి మోదీపై విమర్శలు ఎక్కుపెట్టింది.
వాణిజ్య దౌత్యం, సుంకాలు విధిస్తామని బెదిరించడం ద్వారా యుద్ధాన్ని ముగించామని ఇప్పటికే ట్రంప్ 24 సార్లు ప్రకటించారని, అయినా ప్రధాని మోదీ(Prime Minister Modi) ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించింది.
Congress Party | ఎందుకు రాజీ పడ్డారు..
దేశ భద్రత, గౌరవ విషయంంలో ఎందుకు రాజీ పడ్డారని కాంగ్రెస్ పార్టీ(Congress Party) ప్రశ్నించింది. ఈ మేరకు Xలో ఓ పోస్ట్ చేసిన ప్రతిపక్ష పార్టీ.. భారత జాతీయ గౌరవాన్ని దెబ్బతీశారని ఆరోపిస్తూ ప్రధాని మోదీ కొనసాగిస్తున్న మౌనాన్ని నిలదీసింది.
“ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో 5 జెట్ విమానాలు నేలకూలాయని ట్రంప్ చెబుతున్నారు. అలాగే, సుంకాలు పెంచుతామని బెదిరించడం ద్వారా యుద్ధాన్ని తాను ఆపానని ఆయన 24వ సారి పేర్కొన్నారు. ట్రంప్ తరచూ ఇదే చెబుతున్నారు. అటు నరేంద్ర మోదీ మౌనంగా ఉన్నారు. వాణిజ్యం కోసం నరేంద్ర మోడీ దేశ గౌరవాన్ని ఎందుకు రాజీ పడ్డారు?” అని కాంగ్రెస్ ‘X’లో పోస్ట్ చేసింది.
Congress Party| ప్రధాని ప్రకటన చేయాలి..
ట్రంప్ తరచూ చేస్తున్న వ్యాఖ్యలపై ప్రధానమంత్రి వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రకటన చేయాలని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ (Congress MP Jairam Ramesh) డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఆయన ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ.. ట్రంప్, ప్రధాని మోదీ మధ్య ఉన్న స్నేహాన్ని గుర్తు చేశారు.
“సెప్టెంబర్ 2019లో హౌడీ మోడీ, ఫిబ్రవరి 2020లో నమస్తే ట్రంప్ వంటి కార్యక్రమాలతో అధ్యక్షుడు ట్రంప్‌తో సంవత్సరాల తరబడి స్నేహం కలిగి ఉన్న ప్రధానమంత్రి.. గత 70 రోజులుగా ట్రంప్ ఏమి చెబుతున్నారో వినడం లేదా? దీనిపై ప్రధాని పార్లమెంటులో స్పష్టమైన ప్రకటన చేయాలి” అని జైరామ్ రమేశ్ అన్నారు. ఐదు జెట్‌లు కూలిపోయాయన్న ట్రంప్ ప్రకటనను సంచలనాత్మకంగానే భావించాల్సి ఉందన్నారు. దీనిపై పార్లమెంట్‌లో చర్చ కోసం కాంగ్రెస్ సహా అన్ని ప్రతిపక్షాలు ప్రత్యేక చర్చకు పట్టుబడతాయని, ప్రధాని సమాధానం చెప్పాలని అన్నారు.