అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Panchayat Elections | పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పల్లెల్లో సందడి నెలకొంది. ప్రజలు చలితో వణికిపోతుంటే.. పల్లె పోరుతో రాజకీయాలు వేడెక్కాయి. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అయితే ఓ ఎమ్మెల్యే భార్య సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఈ ఘటన మెదక్ జిల్లా (Medak District)లో చోటు చేసుకుంది.
హైదరాబాద్ నగరంలోని కార్వాన్ ఎమ్మెల్యేగా కౌసర్ మొహియుద్దీన్ పని చేస్తున్నారు. ఆయన వరుసగా మూడు సార్లు ఎంఐఎం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆయన స్వగ్రామం మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని బస్వాపూర్. సర్పంచ్ ఎన్నికల (Sarpanch Election) నేపథ్యంలో తన భార్య నజ్మా సుల్తానాతో గ్రామంలో నామినేషన్ వేయించారు. ఈ నెల 4న ఆమె నామినేషన్ వేశారు.
Panchayat Elections | ఏకగ్రీవంగా..
ఎమ్మెల్యే మొహియుద్దీన్ హైదరాబాద్ (Hyderabad)లో ఉంటున్న స్వగ్రామంతో అనుబంధం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా పంచాయతీ ఎన్నికల్లో ఆయన భార్యను గ్రామస్తులు ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. ఈ మేరకు ఎన్నికల అధికారులు ఆదివారం ప్రకటించారు. కాగా నజ్మాసుల్తానా గతంలో హైదరాబాద్‌లోని గోల్కొండ, నానక్‌నగర్ (Nanaknagar) నుంచి రెండు సార్లు కార్పొరేటర్‌గా పని చేశారు.
Panchayat Elections | గ్రామస్తులకు కృతజ్ఞతలు
తన భార్య బస్వాపూర్ సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నికవడంపై ఎమ్మెల్యే మొహియుద్దీన్ గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ ప్రజలు మా కుటుంబంపై నమ్మకం ఉంచినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు. 20 కంటే తక్కువ మంది ముస్లిం ఓటర్లు ఉన్నప్పటికీ, బస్వాపూర్ నివాసితులు తన భార్యను ఎన్నుకోవడం ద్వారా ఐక్యత, విశ్వాసాన్ని ప్రదర్శించారని పేర్కొన్నారు. దీనిని తాము గొప్ప గౌరవంగా, బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు. గ్రామస్తులకు ఎల్లప్పుడు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.