HomeసినిమాMitra Mandali Movie | మిత్ర మండ‌లి మూవీ రివ్యూ.. కామెడీ వ‌ర్క‌వుట్ అయిందా?

Mitra Mandali Movie | మిత్ర మండ‌లి మూవీ రివ్యూ.. కామెడీ వ‌ర్క‌వుట్ అయిందా?

Mitramandali Movie | మిత్ర మండలి సినిమా గురువారం రిలీజ్​ అయింది. ఇండస్ట్రీలోని పాపులర్ కమెడియన్స్ మొత్తం న‌టించిన ఈ సినిమాలో కామెడి అంతగా వ‌ర్క‌వుట్ కాలేదు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mitra Mandali Movie | “లిటిల్ హార్ట్స్” వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత, బన్నీ వాసు నుండి వ‌చ్చిన‌ చిత్రం “మిత్ర మండలి”. బడ్డీ కామెడీ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రేక్షకులను నవ్వించడానికి ఇండస్ట్రీలోని పాపులర్ కమెడియన్స్ మొత్తం న‌టించారు. సినిమా ప్రమోషనల్ కంటెంట్ కూడా ప్రేక్షకుల దృష్టిని గట్టిగా ఆకర్షించడంతో భారీ అంచనాలు ఏర్ప‌డ్డాయి. ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం!

క‌థ‌ : జంగ్లీ పట్నాలోని ఒక కథ లేని కథతో “మిత్రమండలి” సినిమా (Mitra Mandali Movie) తెరకెక్కింది. కథ లేకపోవడం వల్ల సినిమా ఎలా ఉంటుందనే సందేహం కలగొచ్చ‌నే అవకాశం ఉందని దర్శకుడు ముందే టైటిల్ కార్డ్స్‌లో స్పష్టం చేశారు. నిజానికి, ఈ సినిమా కథ కంటే క్యారెక్టర్‌లతోనే ఆధారపడి సాగుతుంది.సినిమా ప్రధానంగా న‌లుగురిపై కేంద్రీకరించబడింది. చైతన్య (ప్రియదర్శి), అభి (రాగ మయూర్), సాత్విక్ (విష్ణు ఓయి సా), రాజీవ్ (ప్రశాంత్ బెరహా). వీరు రాత్రి తాగడం, తిరగడం, ఇంట్లోవాళ్లతో తన్నులు తినడం వంటివి చేస్తుండేవారు.

ఇక నారాయణ (వీటీవీ గణేష్) అనే వ్య‌క్తి కులాన్ని అడ్డుపెట్టుకొని ఎమ్మెల్యేగా ట్రై చేస్తుంటాడు. ఆ స‌మ‌యంలో అతని కూతురు స్వేచ్ఛ (నిహారిక) వేరే కులపోడైన చైతన్యతో ప్రేమలో పడుతుండడం కథకు మూలంగా మారింది. ఇదే మూలంగా చైతన్య, అభి, సాత్విక్ వంటి మిత్రులు చిక్కుల్లో పడతారు. చివరి సీక్వెన్స్‌లో నారాయణ తన కూతురు విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నాడో, అతనికి చివరికి మిగిలిందేమిటో, పరువు, పదవి, కులపిచ్చి నేపథ్యంతో సెటారికల్‌గా చూపించారు.ఇలా “మిత్రమండలి”లో కథ లేకపోయినా, ప్రత్యేకమైన క్యారెక్టర్‌ డ్రామా, సిట్యూయేషన్‌ల ద్వారా వినోదాన్ని అందించారు.

నటీనటుల పనితనం:

“మిత్రమండలి” సినిమాలో ఇండస్ట్రీలో పేరున్న టాప్ కమెడియన్స్ (Top Comedians)అందరూ నటించినప్పటికీ, ప్రేక్షకులని మ‌న‌స్పూర్తిగా న‌వ్వించ‌డంలో విఫలమయ్యారు. ప్రియదర్శి (Priyadarshi), రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా, వెన్నెల కిషోర్ వంటి సీనియర్ కమెడియన్స్ ఉన్నా, డైలాగులు సరైన రీతిలో పేలకపోవడం, క్యారెక్టర్లు వర్క్ అవ్వకపోవడం వల్ల సీన్స్ అంత‌గా పేల‌లేదు. హీరోయిన్ నిహారిక లుక్స్ విషయంలో అంత‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. ఒక్క ఇంట్రడక్షన్ సీన్ తప్ప, మిగతా సన్నివేశాల్లో ఆమె తేలిపోయింది. సత్య ఒక్కడు మాత్రం కంప్రెస్డ్ టైమింగ్‌లో నవ్వించ‌డానికి ప్రయత్నించాడు. విటివి గణేష్, జీవన్ తదితరుల కామెడీ టైమింగ్ కూడా సన్నివేశాల్లో సరిగ్గా ల్యాండ్ కాకపోవడం, క్యారెక్టర్లని స‌రిగ్గా వాడుకోలేదు.

సాంకేతిక రంగం:

దర్శకుడు విజయేందర్ (Director Vijayender)రాసుకున్న సన్నివేశంలో హాస్యానికి ఆస్కారం ఉన్న‌ప్ప‌టికీ వాటిని స‌రిగ్గా కంపోజ్ చేయ‌లేక‌పోయాడు. కామెడీకి సంబంధించిన స‌న్నివేశాల‌ని తెర‌పై చూపించ‌డంలో టాలెంట్ ఆధార‌ప‌డి ఉంటుంది. ఈ విష‌యంలో విజయేందర్ విఫలమయ్యాడు. అలాగని అతడి రాతలో విషయం లేద‌ని కాదు.. ప్రస్తుత సమాజంలోని చాలా అంశాలకు త‌న‌దైన శైలిలో కౌంట‌ర్ ఇచ్చాడు. అది సోషల్ మీడియాకి యువత దాసోహం, తల్లిదండ్రులు పిల్లల మీద పెట్టే ప్రెజర్ , కుల వ్యవస్థ కావచ్చు, రాజకీయ నాయకులను గుడ్డిగా నమ్మి, ఫాలో అయ్యే కార్యకర్తల మైండ్ సెట్స్ వంటి అంశాల మీద సెటైర్స్ రాసుకున్నాడు కాని అంతగా పేల‌లేదు. ఎక్కువ మంది ఆర్టిస్టులను పెట్టేసుకోవడం వల్ల స‌రిగ్గా డీల్ చేయ‌లేక‌పోయాడ‌నే భావ‌న క‌లిగింది. ఆర్.ఆర్.ధృవన్ తన సంగీతంతో నవ్వించే ప్రయత్నం చేశాడు. సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ పరిస్థితి అంతంత‌మాత్ర‌మే. చాలా షాట్స్ లో గ్రీన్ మ్యాట్ సీక్వెన్సులు క‌నిపిస్తాయి. డి.ఐ కొన్ని సీన్స్ లో మరీ ఎక్కువ బ్రైట్ కావ‌డం నటీనటుల లుక్స్ ను కూడా డ్యామేజ్ చేసింది. ప్రొడక్షన్ డిజైన్, సౌండ్ మిక్సింగ్, కాస్ట్యూమ్స్ వంటి డిపార్ట్మెంట్స్ మాత్రం చాలా హార్డ్ వ‌ర్క్ చేసిన‌ట్టు స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది.

ప్ల‌స్ పాయింట్స్ :

స‌త్య కామెడీ
సౌండ్ మిక్సింగ్‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన్
కాస్ట్యూమ్స్

మైన‌స్ పాయింట్స్:

ద‌ర్శ‌క‌త్వం
సినిమాటోగ్ర‌ఫీ
స్పూఫ్ కామెడీ వ‌ర్క‌వుట్ కాలేదు

న‌టీన‌టులు : ప్రియదర్శి , నిహారిక ఎన్.ఎం, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా, వెన్నెల కిషోర్, సత్య, విటివి గణేష్, జీవన్ తదితరులు
ద‌ర్శ‌కుడు : విజయేందర్.ఎస్
నిర్మాత‌లు : కళ్యాణ్ మంతిన – భానుప్రతాప్, విజేందర్ రెడ్డి తీగల
సంగీతం : ఆర్.ఆర్.ధృవన్
సినిమాటోగ్ర‌ఫీ : సిద్ధార్జ్ ఎస్.జె
రిలీజ్ డేట్ : అక్టోబర్ 16, 2025

విశ్లేషణ‌:

అప్పట్లో జాతి రత్నాలు ,రీసెంట్‌గా వ‌చ్చిన‌ లిటిల్ హార్ట్స్ వంటి సినిమాలు కథ లేకపోయినా, కామెడీ వర్కౌట్ బాగా ఉండడంతో కమర్షియల్ హిట్టుగా నిలిచాయి. కథ లేకున్నా కామెడీతో ఆడియన్స్‌ని థియేట‌ర్స్‌కి ర‌ప్పించాల‌ని అనుకున్నాడు కాని ‘మిత్రమండలి’ లో కథ , కామెడీ కూడా proper గా రాలేదు. కామెడీ లేకపోవడంతో దర్శకుడు విజయేంద్రర్ చెప్పినట్టుగా సినిమా అంతా సోది మాదిరి అయింది. రాసే సన్నివేశంలో, నటీనటులు పలికే సంభాషణల్లో మాత్రమే కాకుండా సదరు సందర్భాల‌లో కూడా సీన్స్ ప్రేక్ష‌కుల‌కి న‌చ్చితేనే సినిమా హిట్ అవుతుంది. మిత్ర మండ‌లి వాట‌న్నింట్లో తేలిపోయింది.

రేటింగ్ : 2/5