అక్షరటుడే, వెబ్‌డెస్క్: Minister Sridhar Babu | తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని మంత్రి శ్రీధర్‌బాబు (Minister Sridhar Babu) సంస్థలను ఆహ్వానించారు. దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశంలో ఇండియా పెవిలియన్ ప్రారంభోత్సవం సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడారు.
పారిశ్రామికవేత్తలు, వాటాదారులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ వ్యాపార సౌలభ్యంలో జాతీయ ఆదర్శంగా నిలిచిందన్నారు. పారిశ్రామిక అభివృద్ధికి అత్యంత అనుకూలమైన, విధానాల ఆధారిత పర్యావరణ వ్యవస్థను అందిస్తోందని వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
Minister Sridhar Babu | రైజింగ్ తెలంగాణలో..
రైజింగ్ తెలంగాణలో (Rising Telangana) భాగంగా 2047 నాటికి భారతదేశ జీడీపీకి రాష్ట్ర వాటాను 10 శాతానికి పెంచాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుందన్నారు. దానిని నిర్మించుకోవడమే ప్రభుత్వ విధానమని తెలిపారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి ప్రభుత్వం సంస్థాగత సంస్కరణలు, ప్రణాళికాబద్ధమైన వ్యూహాన్ని అనుసరిస్తోందన్నారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను (Telangana economy) 3 ట్రిలియన్ డాలర్లకు విస్తరించడానికి ఒక సమగ్ర రోడ్‌మ్యాప్ సిద్ధం చేసినట్లు ఆయన తెలియజేశారు. ఈ విజన్ డాక్యుమెంట్‌లో ఫార్మాస్యూటికల్స్, లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ, హెల్త్‌కేర్ ఇన్నోవేషన్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, హార్డ్‌వేర్ తయారీ, ఐటీ వంటి రంగాలకు ప్రాధాన్యం ఇచ్చామన్నారు. తెలంగాణ ప్రపంచ బ్రాండ్‌ను మరింత బలోపేతం చేయడానికి లైఫ్ సైన్సెస్ పాలసీ 2.0, తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ (TAIH)లను దావోస్ వేదికగా ఆవిష్కరించనున్నట్లు శ్రీధర్ బాబు ప్రకటించారు.