అక్షరటుడే, వెబ్‌డెస్క్: Methi Mutton | సాధారణంగా మటన్ అంటేనే మాంసాహార ప్రియులకు అమితమైన ఇష్టం. అయితే ప్రతి ఆదివారం ఒకేలాంటి మటన్ కర్రీ తిని బోర్ కొడుతోందా? అయితే ఈసారి ఒక స్పెషల్ వెరైటీని తీసుకొచ్చాం. అదే “మేథీ మటన్ కర్రీ”.
ఆరోగ్యానికి మేలు చేసే మెంతికూర, పాలకూరలను మటన్ ముక్కలతో కలిపి వండితే వచ్చే ఆ రుచే వేరు. ఆకుకూరలు తినడానికి మారాం చేసే పిల్లలు కూడా ఈ కూరను వదిలిపెట్టకుండా లాగించేస్తారు. తక్కువ శ్రమతో, ఇంట్లో ఉండే పదార్థాలతోనే ఈ హోటల్ స్టైల్ కర్రీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.
Methi Mutton | కావాల్సిన పదార్థాలు:
మటన్: ముప్పావు కిలో (శుభ్రం చేసినవి)
ఆకుకూరలు: ఒక పెద్ద కప్పు మెంతికూర, అర కప్పు పాలకూర తరుగు
ముక్కలు: 3 ఉల్లిపాయలు, 3 టమాటాలు
మసాలాలు: అల్లం తరుగు (1 స్పూన్), వెల్లుల్లి తరుగు (1 స్పూన్), పసుపు, ధనియాల పొడి, గరం మసాలా (ఒక చెంచా చొప్పున)
ఇతరాలు: నూనె (పావు కప్పు), కారం, ఉప్పు (రుచికి తగినంత)
Methi Mutton | తయారీ విధానం :
మొదట మెంతికూరను కాడలు లేకుండా తుంచి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. పాలకూర, ఉల్లిపాయలు, టమాటాలను చిన్న ముక్కలుగా కోసి సిద్ధం చేసుకోవాలి. మటన్ ముక్కలను నీటితో శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి.
స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి. ఆ తర్వాత అల్లం-వెల్లుల్లి తరుగు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, కారం వేసి మసాలాలన్నీ పచ్చి వాసన పోయే వరకు కలపాలి.
ఇప్పుడు శుభ్రం చేసిన మటన్ ముక్కలు, టమాటా ముక్కలు వేసి మీడియం మంటపై రెండు నిమిషాలు వేయించాలి. ఆపై ఒకటిన్నర కప్పుల వేడి నీళ్లు పోసి, మూత పెట్టి సుమారు పది నిమిషాల పాటు ముక్క మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి.
మటన్ సగం ఉడికాక, సిద్ధం చేసుకున్న మెంతికూర, పాలకూర తరుగును అందులో వేయాలి. కూరలోని నీరు మొత్తం పోయి, నూనె పైకి తేలే వరకు మధ్యమధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి.
మటన్ ముక్క సాఫ్ట్‌గా ఉడికి, మసాలాలన్నీ ఆకుకూరలతో కలిసిపోయి ఘుమఘుమలాడుతున్నప్పుడు స్టవ్ ఆపేయాలి.
అంతే! ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన మేథీ మటన్ కర్రీ రెడీ. దీనిని వేడివేడి అన్నం, రోటీలతో సర్వ్ చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే.