అక్షరటుడే, వెబ్డెస్క్ : Medaram Jathara | ములుగు జిల్లా మేడారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) ఆదివారం పర్యటించారు. సమ్మక్క–సారలమ్మను (Samakka-Saralamma temple) దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
మేడారం జాతర (Medaram Jatara) శాశ్వత అభివృద్ధి పనుల పురోగతిపై మంత్రులతో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమ్మక్క–సారలమ్మ జాతర తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శాశ్వత నిర్మాణాలతో, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.260 కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు. ఇందులో జాతర నిర్వహణకు రూ.150 కోట్లు, శాశ్వత ఆలయ నిర్మాణాలకు రూ.110 కోట్లు కేటాయించామని వెల్లడించారు. పనులు 85 శాతం పూర్తయ్యాయని, మిగిలినవి 15వ తేదీ లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. జాతర ముగిసే వరకు అన్ని శాఖల అధికారులు అప్రమత్తతతో ఉండాలన్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.
Medaram Jathara | రామగుండం పవర్ ప్లాంట్
పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో (Ramagundam constituency) డిప్యూటీ సీఎం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టామన్నారు. ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక అయిన 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టుకు క్యాబినెట్ ఆమోదం లభించిందని చెప్పారు. త్వరలోనే రామగుండంలో పవర్ ప్లాంట్ ప్రకటన ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న 5.14 లక్షల రెగ్యులర్ ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద బీమా సదుపాయం త్వరలోనే కల్పిస్తామన్నారు.