అక్షరటుడే, వెబ్‌డెస్క్: Medaram Jathara | మేడారంలో ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడుతోంది. మహా జాతర (Medaram Jathara) సమీపిస్తుండటంతో పనులు వేగంగా సాగుతున్నాయి.
అభివృద్ధి పనులపై మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy), సీతక్క (Minister Seethakka) మంగళవారం సమీక్షించారు. జాతర సమీపిస్తున్న తరుణంలో, సమ్మక్క-సారలమ్మ ఆలయంలో శాశ్వత అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. ఆలయ పునరుద్ధరణ, ఫ్లోరింగ్, ఇసుకరాయి శిల్పాలు, క్యూ లైన్, గద్దెలు నిర్మాణాలు, రోడ్లు, జంక్షన్లు, బస్ స్టేషన్ మెరుగుదలలు, ఆలయ లైటింగ్, గేట్లు, ల్యాండ్ స్కేపింగ్ తదితర పనులు కొనసాగుతున్నాయి.
Medaram Jathara | నెలాఖరు నాటికి పూర్తి చేయాలి
మేడారంలో కోర్ పనులను డిసెంబర్ 31 నాటికి పూర్తి చేయాలని మంత్రులు ఆదేశించారు. మిగిలిన అన్ని ప్రాజెక్టులను జనవరి 5 నాటికి పూర్తి చేయాలన్నారు. ఇందులో సెంట్రల్ లైటింగ్, నీటి సౌకర్యాలు, రోడ్డు విస్తరణ పనులు ఉన్నాయి. జాతరను ఘనంగా, సజావుగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు.
భవిష్యత్ తరాల కోసం ఆలయ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటానికి, పాలరాతి శిల్పాలు, పవిత్ర నిర్మాణాలతో సహా గిరిజన ఆచారాలు, వారసత్వ అంశాలను చేర్చడం ద్వారా తాత్కాలిక ఏర్పాట్ల కంటే శాశ్వత అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రులు సూచించారు. సమీక్షలో కలెక్టర్ దివాకర్, ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకాన్, ఐటీడీఏ పీవో చిత్ర మిశ్రా, డీఎఫ్‌వో రాహుల్ కిషన్ జాదవ్ పాల్గొన్నారు.