అక్షరటుడే, వెబ్‌డెస్క్: Mauni amavasya | సాధారణంగా పుష్య మాసంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్య లేదా చొల్లంగి అమావాస్య అని పిలుస్తారు. అయితే ఈ ఏడాది (2026) జనవరి 18న ఈ అమావాస్య ఆదివారం రోజున రావడం విశేషం. ఆదివారంతో కూడిన అమావాస్య అత్యంత శక్తివంతమైనదని, ఈ రోజున చేసే పరిహారాల వల్ల జాతక దోషాలు తొలగి అఖండ రాజయోగం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
Mauni amavasya | అనుసరించాల్సిన విధివిధానాలు :
పితృ తర్పణాలు: మౌని అమావాస్య రోజున నదీ స్నానానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. నదిలో స్నానం ఆచరించి, నల్ల నువ్వులతో పితృదేవతలకు తర్పణం వదలడం వల్ల 21 తరాల పితృదేవతలకు పుణ్యగతులు లభిస్తాయని శాస్త్రం చెబుతోంది. దీనివల్ల వంశాభివృద్ధి, పితృదోష నివారణ జరుగుతుంది.
ప్రతికూల శక్తి (Negative Energy) తొలగడానికి : ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ పోయి, లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి. ఒక గాజు పాత్రలో నీళ్లు తీసుకుని, అందులో కొంచెం పచ్చ కర్పూరం పొడి కలపండి. ఈ పాత్రను ఇంటి ప్రధాన గుమ్మం లోపలి వైపు ఒక మూలలో ఉంచండి. అమావాస్య తిథి ముగిసే వరకు అక్కడే ఉంచి, మరుసటి రోజు ఆ నీటిని మొక్కలకు పోయండి.
దిష్టి దోషాలు, శత్రు బాధల నివారణకు: ఎదుటివారి ఏడుపు, నరదిష్టి లేదా శత్రువుల వల్ల కలిగే ఇబ్బందులు తొలగిపోవడానికి సాయంత్రం వేళ ఈ ‘శక్తివంతమైన దీపం’ వెలిగించండి. సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య (సూర్యాస్తమయ సమయం). ఇంటి గుమ్మం ముందు రెండు ఆకులు (తమలపాకులు ఉత్తమం) ఉంచి, వాటిపై రాళ్ల ఉప్పును కుప్పగా పోయాలి. ఉప్పు పైన కొన్ని నల్ల నువ్వులు చల్లి, కొత్త మట్టి ప్రమిదను ఉంచాలి. అందులో నువ్వుల నూనె పోసి, మూడు ఒత్తులు వేసి దీపం వెలిగించాలి.
లక్ష్మీదేవి అనుగ్రహం కోసం: ఆదివారం అమావాస్య వచ్చినప్పుడు లక్ష్మీదేవికి మిరియపు గంధంతో బొట్టు పెట్టడం శుభప్రదం. ఒక మిరియం గింజను నీటిలో అరగదీసి తీసిన గంధాన్ని అమ్మవారికి సమర్పించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి ధనలాభం కలుగుతుంది.
ఈ చిన్న పరిహారాలు పాటించడం వల్ల ఏడాది పొడవునా మీకు అదృష్టం కలిసి రావడమే కాకుండా, దుష్టశక్తుల ప్రభావం నుంచి రక్షణ లభిస్తుంది.