అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Transfers | రాష్ట్ర ప్రభుత్వం భారీగా మున్సిపల్ కమిషనర్ల (municipal commissioners)ను బదిలీ చేసింది. మొత్తం 47 మందికి స్థాన చలనం కలిగిస్తూ.. పురపాలిక పరిపాలన శాఖ కార్యదర్శి శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రంలో త్వరలో 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రెండు, మూడు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో తాజాగా 47 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేసింది. ఎన్నికల ప్రక్రియను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించడం కోసం బదిలీలు చేపట్టినట్లు సమాచారం.
సొంత జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్న వారిని బదిలీ చేశారు. అలాగే చాలా కాలంగా ఒకేచోట విధులు నిర్వహిస్తున్న వారిని సైతం ట్రాన్స్ఫర్ చేశారు. ఆదిలాబాద్ (Adilabad) మున్సిపల్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న సీవీఎన్ రాజును రామగుండంకు బదిలీ చేశారు. క్యాతనపల్లిలో పని చేస్తున్న జీ రాజు ఆదిలాబాద్‌కు రానున్నారు. నల్గొండ (Nalgonda) మున్సిపల్ కమిషనర్ ముసాబ్ అహ్మద్ హుజురాబాద్‌కు, ఆలేరు నుంచి బి శ్రీనివాస్ హుజుర్నగర్ బదీలీ అయ్యారు. వేములవాడ కమిషనర్‌గా సంపత్ కుమార్, ములుగుకు రమేష్, తిరుమలగిరి కమిషనర్‌గా రామచంద్రరావు, ఎదులపురం కమిషనర్‌గా మునవార్, బెల్లంపల్లికి సంపత్ బదిలీ అయ్యారు. బదిలీల ప్రక్రియ సైతం చేపట్టడంతో మున్సిపల్ ఎన్నికల (Municipal elections) నోటిఫికేషన్ వెలువడుతుందని ఆశావహులు చర్చించుకుంటున్నారు.