అక్షరటుడే, వెబ్డెస్క్: Kakinada District | సంక్రాంతి పండుగ ఆనందాల మధ్య కాకినాడ జిల్లాలో ఓ గిరిజన గ్రామాన్ని భారీ అగ్నిప్రమాదం (Major Fire Accident) తీవ్ర విషాదంలోకి నెట్టింది. పండుగ ఏర్పాట్లలో నిమగ్నమైన వేళ, అనుకోకుండా చెలరేగిన కార్చిచ్చు ఊరంతటినీ కాలి బూడిద చేసింది. క్షణాల్లోనే పదుల సంఖ్యలో పూరిళ్లు అగ్నికి ఆహుతి కావడంతో గ్రామ ప్రజలు కట్టుబట్టలతో రోడ్డుపాలయ్యారు.
కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం (Routhulapudi Mandal) సార్లంక అనే మారుమూల గిరిజన గ్రామంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ గ్రామంలో అధికంగా పూరిళ్లే ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. సంక్రాంతి పండుగ కావడంతో గ్రామంలోని చాలామంది గిరిజనులు బట్టలు, సరుకులు కొనుగోలు చేసేందుకు రౌతులపూడి, తుని వంటి పట్టణ ప్రాంతాలకు వెళ్లారు. దీంతో ప్రమాదం జరిగిన సమయంలో గ్రామంలో కొద్దిమంది మాత్రమే ఉండటం గమనార్హం.
Kakinada District | ఘోర అగ్ని ప్రమాదం..
సోమవారం సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో ఒక పూరి గుడిసెలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే అవి పక్కనే ఉన్న గుడిసెలకు వ్యాపించాయి. గుడిసెల్లో ఉన్న గ్యాస్ సిలిండర్లు (Gas Cylinders) పేలిపోవడంతో మంటల తీవ్రత మరింత పెరిగింది. గ్రామంలో ఉన్నవారు ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీయగా, ఒకదాని తర్వాత ఒకటి గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో దాదాపు 40 పూరిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఇళ్లలో ఉన్న బట్టలు, వంట సామాన్లు, ధాన్యం, ఇతర గృహోపకరణాలు అన్నీ మంటల్లో కాలిపోయాయి. లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మంటల్లో కాలి బూడిదైన ఇళ్లను చూసి గ్రామస్తులు కన్నీళ్లపర్యంతమవుతున్నారు.
సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గ్రామానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే భారీ నష్టం జరిగిపోయింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగలేదు. పండుగ పూట నిరాశ్రయులైన గ్రామస్తులు ప్రభుత్వ సహాయాన్ని కోరుతున్నారు. తక్షణమే ఇళ్లు, నిత్యావసరాలు అందించి తమను ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు. ఈ విషాద ఘటనతో సార్లంక గ్రామంలో సంక్రాంతి సంబరాలు విషాదంగా మారాయి.