అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Punjab Blast | పంజాబ్‌లోని అమృతసర్-ఢిల్లీ (Amritsar-Delhi) రైల్వే లైన్‌లో భారీ పేలుడు చోటు చేసుకుంది. పేలుడు ధాటికి పట్టాలు ధ్వంసం అయ్యాయి. లోకో పైలెట్ తీవ్రంగా గాయపడ్డారు.
పంజాబ్‌లోని ఫతేగఢ్ సాహిబ్ జిల్లా (Fatehgarh Sahib District)లోని సిర్హింద్ ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి భారీ పేలుడు సంభవించింది. ఒక రైల్వే లైన్‌లో గూడ్స్ రైలును లక్ష్యంగా చేసుకుని ఆర్డీఎక్స్ ద్వారా పేలుడుకు పాల్పడ్డారు. శక్తివంతమైన పేలు కావడంతో ట్రాక్ ధ్వంసమైంది. గూడ్స్ రైలు (Goods Train) ఇంజిన్ తీవ్రంగా దెబ్బతింది. లోకో పైలెట్‌కు తీవ్ర గాయాలు కావడంతో అధికారులు ఆస్పత్రికి తరలించారు. పేలుడుతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. రైల్వే అధికారులు (Railway Officers), పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఉగ్రదాడి అని పోలీసులు అనుమానిస్తున్నారు.
Punjab Blast | పట్టాలు తప్పిన రైలు
సిర్హింద్‌లోని ఖాన్‌పూర్ గేట్ (Khanpur Gate) సమీపంలో కొత్తగా నిర్మించిన రైల్వే లైన్ మీదుగా గూడ్స్ రైలు ప్రయాణిస్తుండగా పేలుడు జరిగింది. పేలుడు చాలా శక్తివంతంగా ఉండటంతో ట్రాక్‌లోని 3-4 అడుగుల భాగం పూర్తిగా ధ్వంసమైంది. గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పంజాబ్‌లో ఉగ్రదాడికి కుట్ర పన్నినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఆరుగురిని అదుపులోకి తీసుకొని, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రాత్రి ఆర్డీఎక్స్తో రైలును పేల్చడానికి యత్నించడంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హై అలెర్ట్ ప్రకటించారు.