
అక్షరటుడే, వెబ్‌డెస్క్: earthquake : భూకంపంతో ప్రపంచంలో అతిపెద్ద దేశమైన రష్యా (Russia) వణికిపోయింది. తీర ప్రాంతం (coastal area) అతలాకుతలం అయింది. రిక్టర్ స్కేల్(Richter scale)పై భూకంప తీవ్రత 8.7గా నమోదైనట్లు జపాన్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ భారీ భూకంప తీవ్రత నేపథ్యంలో రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పానికి (Kamchatka Peninsula) సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతోపాటు జపాన్(Japan)కు సైతం సునామీ హెచ్చరికలు జారీ కావడం గమనార్హం. మరోవైపు అమెరికాలోని హవాయి రాష్ట్రానికి సైతం సునామీ హెచ్చరికలు (tsunami warnings) జారీ చేశారంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
earthquake : మొదట 8.0గా నమోదు..
అక్కడి స్థానిక కాలమానం ప్రకారం (బుధవారం తెల్లవారుజామున) (జులై 30) ఉదయం 8:25 గంటల సమయంలో ఈ భూకంపం సంభవించిందని జపాన్ వాతావరణ శాఖ పేర్కొంది. కాగా, మొదట 8.0 తీవ్రతతో నమోదు అయినట్లు ప్రకటించిన సంస్థ.. తర్వాత దానిని 8.7గా ప్రకటించింది.
earthquake : భూకంప కేంద్రం ఎక్కడంటే..
జపాన్‌లోని నాలుగు పెద్ద దీవులకు ఉత్తరాన ఉన్న హక్వైడో నుంచి సుమారు 250 కిలోమీటర్ల దూరంలో.. రష్యాలోని పెట్రోపావ్లోవ్స్క్-కమ్చట్స్కీ నగరానికి తూర్పు-ఆగ్నేయంలో 126 కిలోమీటర్ల దూరంలో, 18 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. మొదట్లో 8.7 తీవ్రతగా నమోదైన ఈ భూకంపం తర్వాత 8.8 గా సవరించారు. భూకంప తీవ్రత కారణంగా కమ్చట్కా ద్వీపకల్పంలో 3-4 మీటర్ల ఎత్తున అలలు ఎగసిపడ్డాయి.
రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంలో సునామీ అలలు 3-4 మీటర్ల ఎత్తున ఎగిసిపడ్డాయని అధికారులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఎవరికి గాయాలు లేనప్పటికీ, ఒక కిండర్‌గార్టెన్ భవనం దెబ్బతిన్నట్లు కమ్చట్కా ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్ మంత్రి సెర్గీ లెబెడెవ్ తెలిపారు.
జపాన్, అమెరికా, గ్వామ్ వంటి పసిఫిక్ తీర ప్రాంతాల్లో కూడా సునామీ హెచ్చరికలు జారీ అయిన నేపథ్యంలో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అప్రమత్తమైన అధికారులు సముద్ర తీర ప్రాంతాలను ఖాళీ చేయించారు.
earthquake : 1952 తర్వాతే ఇదే..
కమ్చట్కా ద్వీపకల్పంలో సంభవించిన భూకంపం అత్యంత శక్తివంతమైనదని చెబుతున్నారు. 1952 తర్వాత సంభవించిన భూకంపాల్లో అత్యధిక తీవ్రతతో వచ్చింది ఇదేనని రష్యా, అమెరికా, జపాన్ వెల్లడించాయి. దీని ప్రభావం భారీగా ఉంటుందని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
earthquake : సునామీ హెచ్చరికలు
ఈ భూకంపం తర్వాత జపాన్‌లోని హొక్కైడో ఉత్తర తీరంలో సునామీ అలలు మొదట 30 సెంటీమీటర్ల ఎత్తులో వచ్చినట్లు జపాన్ మీడియా తెలిపింది. పసిఫిక్ తీరంలోని ప్రజలకు వెంటనే ఖాళీ చేయాలని జపాన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సునామీ అలల వల్ల భారీ నష్టం సంభవించే అవకాశం ఉంది. తీర ప్రాంతాలు, నదీ తీరాల నుంచి ప్రజలు వెంటనే ఎత్తైన ప్రదేశాలకు లేదా సురక్షిత భవనాలకు వెళ్లాలని తెలిపింది. మళ్లీ ఆదేశాలు వచ్చే వరకు సురక్షిత ప్రదేశాన్ని వదిలి వెళ్లవద్దని జపాన్ అధికారులు పేర్కొన్నారు.
earthquake : హవాయి, అలస్కాలలోనూ..
భారీ భూకంపం నేపథ్యంలో అమెరికాలోని హవాయి (Hawaii), అలాస్కా (Alaska) రాష్ట్రాలకు కూడా సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. హవాయిలో 3 మీటర్ల ఎత్తైన అలలు వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. హవాయి రాజధాని హోనోలులు సహా ఓహు దీవిలోని పలు ప్రాంతాలను తక్షణ స్థలం ఖాళీ చేయాలని ఆదేశించారు. గ్వామ్ దీవిలో 1 నుంచి 3 మీటర్ల ఎత్తైన అలలు వచ్చే ఛాన్స్ ఉందని అమెరికా పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ తెలిపింది.