అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | చైనాపై వంద శాతం అదనపు సుంకాలు విధిస్తామన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Donald Trump) ప్రకటనతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. ఇరుదేశాల మధ్య వాణిజ్య యుద్ధం ఎక్కడికి దారితీస్తుందోనన్న ఆందోళనతో ప్రారంభంలో అమ్మకాలకు పాల్పడ్డారు.
అయితే కొద్దిసేపటికే మార్కెట్లు తేరుకున్నాయి. చైనాను బాధపెట్టాలని కోరుకోవడం లేదన్న ట్రంప్ ప్రకటనతో పరిస్థితి కొంత మారింది. సోమవారం ఉదయం సెన్సెక్స్ 451 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ(Nifty) 108 పాయింట్ల నష్టంతో ప్రారంభమయ్యాయి. సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. సెన్సెక్స్ 82,043 నుంచి 82,438 పాయింట్ల మధ్యలో, నిఫ్టీ 25,152 నుంచి 25,267 పాయింట్ల మధ్యలో ట్రేడ్ అయ్యాయి. చివరికి సెన్సెక్స్(Sensex) 173 పాయింట్ల నష్టంతో 82,327 వద్ద, నిఫ్టీ 58 పాయింట్ల నష్టంతో 25,227 వద్ద స్థిరపడ్డాయి.
ఐటీ, ఎఫ్‌ఎంసీజీ సెక్టార్లలో అమ్మకాలు..
బీఎస్‌ఈలో క్యాపిటల్ మార్కెట్ ఇండెక్స్ 0.90 శాతం, పీఎస్‌యూ బ్యాంక్(PSU bank) 0.22 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.20 శాతం, యుటిలిటీ 0.19, బ్యాంకెక్స్ 0.11 శాతం, ఇన్‌ఫ్రా ఇండెక్స్ 0.09 శాతం లాభపడ్డాయి. క్యాపిటల్ గూడ్స్ 0.85 శాతం, ఎఫ్‌ఎంసీజీ 0.83 శాతం, ఐటీ ఇండెక్స్ 0.82 శాతం, టెలికాం 0.66 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ 0.62 శాతం, కమోడిటీ 0.42 శాతం తగ్గాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.43 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.19 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.18 శాతం నష్టపోయాయి.
అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 1,664 కంపెనీలు లాభపడగా 2,627 స్టాక్స్ నష్టపోయాయి. 168 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 157 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 122 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 7 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 8 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.
Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 12 కంపెనీలు లాభాలతో ఉండగా.. 18 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. అదాని పోర్ట్స్ 2.04 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.32 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 0.93 శాతం, యాక్సిస్ బ్యాంక్ 0.79 శాతం, ఎయిర్‌టెల్ 0.68 శాతం పెరిగాయి.