HomeUncategorizedMaoists | భారీగా లొంగిపోయిన మావోయిస్టులు

Maoists | భారీగా లొంగిపోయిన మావోయిస్టులు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Maoists | కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్​ కగార్​తో (Operation Kagar) కలవరపడుతున్న మావోయిస్టులను లొంగుబాట్లు మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఆపరేషన్ కగార్​లో భాగంగా వేల సంఖ్యలో బలగాలు అడవులను జల్లెడ పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జరిగిన ఎన్​కౌంటర్లలో (Encounters) భారీగా నక్సల్స్​ మృతి చెందుతున్నారు. ఇటీవల కీలక నేతలు సైతం నేలకు ఒరిగారు. దీంతో ఆందోళన చెందుతున్న మావోయిస్టులకు లొంగుబాట్లు మరింత్​ షాక్ ఇస్తున్నాయి. తాజాగా ఛత్తీస్​గఢ్​లో 51 మంది మావోయిస్టులు లొంగిపోయారు.

Maoists | తగ్గుతున్న కార్యకలాపాలు

ఛత్తీస్​గఢ్​​లోని (Chhattisgarh) నారాయణపూర్‌, బీజాపూర్‌, సుక్మా, కాంకేర్‌ జిల్లాల్లో మొత్తం 51 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఆపరేషన్​ కగార్​తో పాటు, పునరావాస విధానం అమలు చేయడంతో చాలా మంది మావోలు అడవులను వీడి జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్లు బస్తర్ ఐజీ సుందర్‌రాజ్ తెలిపారు. 2024 నుంచి ఇప్పటివరకు బీజాపుర్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లలో 185 మంది మావోయిస్టులు హతమయ్యారని ఆయన పేర్కొన్నారు. 431 మంది లొంగిపోయారన్నారు.

Maoists | రూ.1.15 కోట్ల రివార్డు

బీజాపూర్ జిల్లాలో 25 మంది గురువారం లొంగిపోయారు. వారిపై రూ.1.15 కోట్ల రివార్డు ఉన్నట్టు బస్తర్​ ఐజీ సుందర్​రాజ్​ తెలిపారు. లొంగిపోయిన వారికి ప్రోత్సాహకంగా రూ.50 వేల చెక్కులు అందించారు. అలాగే కాంకేర్ ఎస్పీ కల్యాణ్ ఎలిసెల ఎదుట 13 మంది లొంగిపోయారు. సుక్మా ఎస్పీ ఎదుట ఐదుగురు లొంగిపోయారు.

నారాయణపూర్ ఎస్పీ రాబిన్‌సన్ గుడియా సమక్షంలో ఎనిమిది మావోలు లొంగిపోయారు. వీరిలో నలుగురు మహిళలు కూడా ఉన్నారు. కమాండర్ కమలేశ్‌ సైతం లొంగిపోయినట్లు ఎస్పీ తెలిపారు. వీరిపై రూ.33 లక్షల రివార్డు ఉంది.