అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Mallujola Venugopal | మావోయిస్ట్ కీలక నేత మల్లోజుల వేణుగోపాల్ రావు(Mallojula Venugopal Rao) అలియాస్ సోనూ పోలీసులకు లొంగిపోయారు. కొంతకాలంగా ఆయన సరెండర్ అవుతారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఆయుధాలు వీడి మహారాష్ట్రలోని గడ్చిరోలిలో ఆయన పోలీసులకు లొంగిపోయారు.
మల్లోజుల వేణుగోపాల్ పెద్దపల్లి జిల్లా(Peddapalli District)కు చెందిన వారు. 2011లో ఎన్కౌంటర్లో చనిపోయిన కిషన్‌జీ అలియాస్ మల్లోజుల కోటేశ్వరరావు సోదరుడు. ఆయన భార్య తారక్క 2018 ఎన్కౌంటర్ మరణించారు. 1970లో ఉద్యమ బాట పట్టిన ఆయన అనేక దాడుల్లో కీలక పాత్ర పోషించారు. వెస్ట్ బెంగాల్ లాల్‌గడ్ ఉద్యమానికి వేణుగోపాల్ నాయకత్వం వహించారు. ఇటీవల లొంగిపోయిన మావోయిస్ట్ పొలిట్ బ్యూరో సభ్యురాలు పోతుల సుజాత వేణుగోపాల్ అన్న భార్య కావడం గమనార్హం. అయితే మల్లోజుల కొంతకాలంగా పార్టీ విధానాలను వ్యతిరేకిస్తున్నారు.
Mallujola Venugopal | లేఖతో కలకలం
మల్లోజుల అభయ్ పేరిట గతంలో లేఖ విడుదల చేశారు. తాము ఆయుధాలు వీడి లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నామని అందులో పేర్కొన్నారు. దీనిపై మావోయిస్ట్ పార్టీ(Maoist Party)లో పెద్ద వివాదం చెలరేగింది. మల్లోజుల తీరును పార్టీ తప్పు పట్టింది. ఆ లేఖ ఆయన సొంత నిర్ణయమని ప్రకటించింది. వెంటనే ఆయుధాలు అప్పగించాలని మల్లోజులను పార్టీ ఆదేశించింది. అనంతరం మల్లోజుల మరో లేఖ రాశారు. పార్టీ అనుసరిస్తున్న పంథా తప్పు అని ఆయన 22 పేజీల లేఖను క్యాడర్‌కు రాశారు. అప్పుడే ఆయన లొంగిపోతారని అంతా భావించారు. తాజాగా ఆయన 60 మందితో కలిసి గడ్చిరోలి పోలీసు(Gadchiroli Police)లకు లొంగిపోయారు.
Mallujola Venugopal | లేఖలో ఏముందంటే..
విప్లవోద్యమంలో లోపాలపై ఇటీవల మల్లోజుల సుదీర్ఘ లేఖ రాశారు. పార్టీలో తీవ్రమైన అంతర్గత సంక్షోభం ఉందని, ఆయుధ పోరాటాలను విరమించాలని కోరారు. దశాబ్దాల తప్పుడు నిర్ణయాలతో పార్టీ ఎంతో నష్టపోయిందని ఆయన పేర్కొన్నారు. పార్టీ బలాన్ని అతిగా అంచనా వేసి, శత్రువు బలాన్ని తక్కువగా అంచనా వేశామని ఆయన అన్నారు. 2011 నుంచే కిందిస్థాయి కామ్రేడ్స్ ఈ తప్పును సరిదిద్దుకోవాలని కోరినప్పటికీ పట్టించుకోలేదన్నారు. ఒక దశాబ్దం పాటు నష్టపోయామని తెలిపారు. అమరుల రక్తతర్పణం నుంచి గుణపాఠాలు నేర్చుకుందామని లేఖలో కోరారు. మల్లోజుల కేంద్ర కమిటీలో 28 ఏళ్లు, పొలిట్ బ్యూరోలో 18 ఏళ్లు సభ్యుడిగా ఉన్నారు. ఈ క్రమంలో ఉద్యమం ఎదురొంటున్న వైఫల్యాలకు, భారీ నష్టాలకు బాధ్యత వహిస్తూ ఆయన బహిరంగ క్షమాపణ చెప్పారు.