HomeతెలంగాణManjira Dam | ప్రమాదంలో మంజీర డ్యామ్​.. మొరాయిస్తున్న గేట్లు

Manjira Dam | ప్రమాదంలో మంజీర డ్యామ్​.. మొరాయిస్తున్న గేట్లు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Manjira Dam | సంగారెడ్డి జిల్లాలోని మంజీర డ్యామ్ (manjira reservoir)​ ప్రమాదంలో పడింది. సింగూరు దిగువన ఉన్న మంజీర బ్యారేజీ నుంచి హైదరాబాద్​ మహానగరానికి తాగునీరు అందుతుంది. అయితే బ్యారేజీ గేట్లు మొరాయిస్తుండడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

సంగారెడ్డి (Sangareddy) జిల్లాలో గల మంజీర బ్యారేజీ గేట్లు మొరాయిస్తుండడంతో నీరంతా వృథాగా పోతోంది. ఇటీవల భారీ వర్షాలు పడడంతో మంజీర (Manjira) నదికి భారీగా వరద వచ్చింది. దీంతో సింగూరు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు. సింగూరు నీటితో మంజీర డ్యామ్ ​సైతం నిండుకుండలా మారడంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు. ప్రస్తుతం ఎగువ నుంచి వరద దగ్గడంతో అధికారులు గేట్లు మూసివేయడానికి ప్రయత్నించారు. అయితే ఒక గేట్​ పూర్తిగా మూసేశారు. మిగతా మూడు గేట్లు మాత్రం బంద్​ కావడం లేదు. దీంతో నీరంతా వృథాగా పోతోంది. నిపుణులను రప్పించి గేట్లను కిందకు దిప్పేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

Manjira Dam | ఖాళీ అవుతున్న రిజర్వాయర్​

మంజీర డ్యామ్​ సామర్థ్యం 1.5 టీఎంసీలు. దీని నుంచి నిత్యం హైదరాబాద్ (Hyderabad)​ నగరానికి తాగునీరు సరఫరా చేస్తారు. ప్రాజెక్ట్​ నిండుకుండలా ఉంటేనే రోజూ 40 మిలియన్‌ లీటర్ల చొప్పున ఏడాది పాటు నగరానికి నీరు సరఫరా చేయొచ్చు. అయితే ప్రస్తుతం గేట్లు బంద్ కాకపోవడంతో నీరంతా వృథా అవుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రాజెక్ట్​ ఖాళీ అవుతుందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. అలా అయితే హైదరాబాద్​ నగరంలో తాగునీటి ఎద్దడి రానుంది. దీంతో ప్రాజెక్ట్​ గేట్ల మరమ్మతులకు అధికారులు చర్యలు చేపట్టారు.

Manjira Dam | బ్యారేజీలో పలు లోపాలు

మంజీర బ్యారేజీలో పలు లోపాలు ఉన్నాయని అధికారులు ఇటీవల తెలిపారు. ప్రాజెక్టుల భద్రతా మండలి అధికారులు ఇటీవల రిజర్వాయర్​ను తనిఖీ చేశారు. బ్యారేజీలో పలు పిల్లర్లకు పగుళ్లు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. అలాగే డ్యామ్​ దిగువన గల అప్రాన్​ కొట్టుకుపోయింది. తుమ్మచెట్లు పెరగడంతో కట్ట బలహీనంగా మారింది. అధికారుల బృందం డ్యామ్​ భద్రతపై హెచ్చరించినా అధికారులు చర్యలు చేపట్టలేదు. ఫలితంగా ప్రస్తుతం గేట్లు మొరాయిస్తున్నాయి.

Manjira Dam | సింగూరు సైతం..

సింగూరు జలాశయం (Singuru Project) సైతం ప్రమాదంలో ఉంది. 29.9 టీఎంసీల సామర్థ్యంతో సింగూరు నిర్మించారు. జూన్​ 23న జలాశయాన్ని ఆనకట్ట భద్రతా కమిటీ పరిశీలించింది. ప్రాజెక్టు రివిట్‌మెంట్‌, మట్టికట్ట, పారాపిట్‌ వాల్‌లు దెబ్బతిన్నాయని గుర్తించింది. వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించింది. 520 మీటర్ల కన్నా ఎక్కువ నీరు నిల్వ ఉంచొద్దని సూచించింది.

అధికారులు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టలేదు. దీంతో ఎగువ నుంచి వరద వస్తున్నా.. జలాశయంలో నిల్వ చేయడం లేదు. ప్రాజెక్ట్ భద్రత దృష్ట్యా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 16.85 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ నుంచి 12 వేల క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తుండగా.. 9 వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్ట్​ నిండుకుండలా ఉంటే సింగూరు, ఘనపురం ఆనకట్ట కింద రైతులకు రెండు పంటలకు నీరు వస్తుంది. ప్రస్తుతం ప్రాజెక్ట్​ నింపకపోవడంతో యాసంగిలో పంటలకు నీరు అందే అవకాశం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.