అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Miss India | మిస్ ఇండియా యూనివర్స్-2025 కిరీటాన్ని మణిక విశ్వశర్మ(Manika Vishwasharma) సొంతం చేసుకున్నారు. రాజస్థాన్‌కు చెందిన ఈ అందాల భామ నవంబర్‌లో థాయిలాండ్‌లో జరిగే 74వ మిస్ యూనివర్స్ పోటీల్లో భారతదేశం తరఫున పాల్గొననున్నారు. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో జరిగిన మిస్ ఇండియా యూనివర్స్ పోటీల్లో(Miss India Universe competition) మణిక విజేతగా నిలిచారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన తాన్యా శర్మ ఫస్ట్ రన్నరప్‌గా, మోహక్ థింగ్రా సెకండ్ రన్నరప్‌గా నిలిచారు. హర్యానాకు చెందిన అమిణి కౌశిక్ మూడో స్థానం సొంతం చేసుకున్నారు. పోటీల్లో గెలుపొందిన మణికకు మిస్ యూనివర్స్ ఇండియా 2024 రియా సింఘా కిరీటాన్ని(Rhea Singha Crowned) తొడిగారు.
Miss India | ఆకట్టుకునే సమాధానాలతో..
అందాల పోటీల్లో అడిగిన ప్రశ్నలకు మణిక ఆకట్టుకునే సమాధానాలు ఇచ్చి విజేతగా నిలిచారు. మహిళల విద్య, పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం.. ఈ రెండింట్లో మీరు దేన్ని, ఎందుకు ఎంచుకుంటారని నిర్వాహకులు ప్రశ్నించగా ఆమె తెలివైన సమాధానం చెప్పి కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. “నాణేనికి రెండు వైపులా. ఒక వైపు, మనకు గుర్తున్నటి నుంచి మహిళలు విద్య వంటి ప్రాథమిక హక్కులను కోల్పోవడాన్ని చూశాము. మరోవైపు, ఈ పేదరికాన్ని చూస్తున్నాం.
మన జనాభాలో యాభై శాతం మందికి ప్రాథమిక సౌకర్యాలు లేకుండా పోయాయి. నన్ను అడిగితే మహిళా విద్యనే ఎంచుకుంటానని” చెప్పారు. ఎందుకంటే చదువు ఒక్క వ్యక్తి జీవితాన్నే కాదు, ఈ దేశంతో పాటు ప్రపంచ భవిష్యత్తును మార్చుతుందని వివరించారు. మహిళలకు విద్య, పేదలకు ఆర్థిక సహాయం రెండూ ముఖ్యమైనప్పటికీ మహిళలకు విద్య అనేది దీర్ఘకాలంగా ఉన్న సమస్యలకు పరిష్కారం చూపుతుందని అభిప్రాయపడ్డారు. ఆమె సమాధానానికి ముచ్చట పడిన నిర్వాహకులు మణికను విజేతగా ప్రకటించారు. అందాల పోటీల్లో గెలుపొందిన ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ నవంబర్‌లో థాయిలాండ్‌లో జరిగే 74వ మిస్ యూనివర్స్ పోటీ(Miss Universe Pageant)లో మాణిక ఇప్పుడు భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు.