అక్షరటుడే, వెబ్‌డెస్క్: Aeroplane missing | విమానాలు Aeroplanes గల్లంతవడం మలేసియా–ఇండోనేషియా (Malaysia-Indonesia) ప్రాంతానికి కొత్తేమీ కాదు. గతంలోనూ పలుమార్లు ఈ ప్రాంతంలో విమానాలు కనిపించకుండా పోయిన ఘటనలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. తాజాగా మరోసారి అదే తరహా ఆందోళనకర ఘటన చోటుచేసుకుంది.
ఇండోనేషియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్‌కు (Indonesia Air Transport) చెందిన ATR 42-500 విమానం నిన్న అకస్మాత్తుగా రాడార్ నుంచి అదృశ్యమైంది. 11 మంది ప్రయాణిస్తున్న ఈ విమానం, ఇండోనేషియాలోని ప్రధాన ద్వీపాలైన జావా – సులవేసి మధ్య ప్రయాణిస్తుండగా, దక్షిణ సులవేసి ప్రావిన్స్‌లోని పర్వత ప్రాంతాల్లో గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. మారోస్ జిల్లా సమీపంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు పూర్తిగా తెగిపోవడంతో అలర్ట్ ప్రకటించారు.
Aeroplane missing | చివరిసారి ఎక్కడ కనిపించింది?
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ విమానం మధ్యాహ్నం 1:17 గంటల సమయంలో మారోస్ జిల్లాలోని లియాంగ్–లియాంగ్ ప్రాంతం వద్ద చివరిసారిగా ట్రాక్ చేయబడింది. ATR 42-500 తరహా విమానం సాధారణంగా 42 నుంచి 50 మంది ప్రయాణికులను తీసుకెళ్లగల సామర్థ్యం కలిగిన ప్రాంతీయ టర్బోప్రాప్ విమానం. సుల్తాన్ హసనుద్దీన్ అంతర్జాతీయ విమానాశ్రయం (Sultan Hasanuddin International Airport) వైపు చేరుకుంటున్న సమయంలో, పైలట్లకు అప్రోచ్ అలైన్‌మెంట్ సరిచేయాలని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సూచించిన కొద్ది సేపటికే విమానం నుంచి ఎలాంటి స్పందన రాలేదని అధికారులు తెలిపారు. ఆ తర్వాత రేడియో కమ్యూనికేషన్ పూర్తిగా నిలిచిపోవడంతో అత్యవసర విపత్తు దశ (Distress Phase) ను ప్రకటించారు.
విమానం గల్లంతైన వెంటనే ఇండోనేషియా వైమానిక దళం హెలికాప్టర్లు, డ్రోన్లు, గ్రౌండ్ సెర్చ్ యూనిట్లతో భారీ స్థాయిలో గాలింపు చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలో బులుసారౌంగ్ పర్వత ప్రాంతంలో హైకర్లు కొన్ని శిథిలాలను గుర్తించినట్లు సమాచారం అందింది. అవి ఎయిర్‌లైన్ లోగోకు దగ్గరగా ఉన్న గుర్తులతో పాటు, స్వల్ప మంటలు కూడా కనిపించినట్లు వారు చెప్పారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ బృందాలు Rescue ఆ ప్రాంతానికి చేరుకుని శోధనను మరింత వేగవంతం చేశాయి.
అయితే పర్వత ప్రాంతం కావడంతో, వాతావరణ పరిస్థితులు మరియు క్లిష్టమైన భూభాగం గాలింపు చర్యలకు అడ్డంకిగా మారుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ విమానంలో ఎనిమిది మంది సిబ్బంది, ముగ్గురు ప్రయాణికులు ఉన్నట్లు ఇండోనేషియా అధికారులు ధృవీకరించారు. వీరంతా ఇండోనేషియా సముద్ర వ్యవహారాలు, మత్స్య శాఖకు చెందిన అధికారులు అని వెల్లడించారు. అధికారిక విధుల్లో భాగంగా ప్రయాణిస్తున్న సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం.