అక్షరటుడే, వెబ్డెస్క్ : Malavika Mohanan | మహిళా ప్రాధాన్యమున్న చిత్రాలపై ఇంకా అనుమానాలే ఎక్కువగా ఉన్నాయని, ఆ ఆలోచనా ధోరణి మారాల్సిన అవసరం ఉందని నటి మాళవిక మోహనన్ స్పష్టం చేశారు. కథానాయికలే కేంద్రబిందువుగా తెరకెక్కే సినిమాలు వాణిజ్యపరంగా నిలబడవని పలువురు నిర్మాతలు ఇప్పటికీ భావిస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. అయితే, ఈ అభిప్రాయానికి గట్టి సమాధానం చెప్పిన చిత్రాలు కూడా ఉన్నాయని మాళవిక గుర్తు చేశారు.
గతేడాది విడుదలై సంచలన విజయం సాధించిన చిన్న చిత్రాల్లో ‘కొత్తలోక: చాప్టర్ 1’ (Kothaloka: Chapter 1)ఒకటిగా నిలిచింది. పరిమిత బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో వసూళ్లు సాధించి సూపర్ హిట్‌గా నిలవడం ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారి తీసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాళవిక మోహనన్, ఈ సినిమా విజయాన్ని ప్రస్తావిస్తూ మహిళా ప్రధాన చిత్రాలపై నిర్మాతల దృష్టికోణం మారాల్సిన అవసరం ఉందని అన్నారు.
Malavika Mohanan | ఇకనైన మారాలి..
మహిళా కథలంటే పెట్టుబడి రాబట్టడం కష్టం అన్న భావన చాలా మందిలో పాతుకుపోయిందని, అందుకే హీరోయిన్లను కేంద్రంగా పెట్టుకుని సినిమాలు చేయడానికి పెద్దగా ముందుకు రారని మాళవిక తెలిపారు. పెట్టుబడి పెట్టే ధైర్యం లేకపోవడం వల్లనే మహిళా ప్రధాన కథలు అరుదుగా తెరపైకి వస్తున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు.అయితే ఈ భావనకు ‘కొత్తలోక: చాప్టర్ 1’ చిత్రం గట్టి కౌంటర్ ఇచ్చిందని మాళవిక అన్నారు. యువ నటి కల్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan) ప్రధాన పాత్రలో నటించినప్పటికీ, ఆ సినిమా వాణిజ్యపరంగా రికార్డులు సృష్టించిందని చెప్పారు. కథపై, నటిపై దర్శక నిర్మాతలు నమ్మకం ఉంచడంతోనే ఈ స్థాయి విజయం సాధ్యమైందని ఆమె వివరించారు.
డొమినిక్ అరుణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గతేడాది ఆగస్టులో విడుదలై మలయాళ చిత్ర పరిశ్రమ (Malayalam Film Industry)లో సరికొత్త రికార్డులు నెలకొల్పింది. ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి, మహిళా ప్రాధాన్యమున్న సినిమాలకూ భారీ మార్కెట్ ఉందని నిరూపించింది. తెలుగు ప్రేక్షకుల నుంచీ ఈ సినిమాకు మంచి ఆదరణ లభించగా, ప్రస్తుతం ఇది ఓటీటీ వేదిక జియో హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది.మొత్తానికి, కథ బలంగా ఉంటే, పాత్రలకు సరైన న్యాయం జరిగితే మహిళా ప్రధాన చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేయగలవని ‘కొత్తలోక: చాప్టర్ 1’ నిరూపించిందని, ఇకనైనా నిర్మాతలు తమ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని మాళవిక మోహనన్ సూచించారు.