అక్షరటుడే, వెబ్‌డెస్క్: Makar Sankranti | తెలుగువారి లోగిళ్లలో సంక్రాంతి అంటేనే ఒక ఉత్సాహం, ఆనందం, ఐక్యతకు ప్రతీక. సూర్యభగవానుడు మకర రాశిలోకి ప్రవేశించి ఉత్తరాయణ పుణ్యకాలం Uttarayana period ప్రారంభమయ్యే ఈ పర్వదినాన్ని మనం ‘పెద్ద పండుగ’గా జరుపుకుంటాం. అయితే, ఈ 2026 మకర సంక్రాంతి వేళ ఒక వింత ప్రచారం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా కొడుకులు ఉన్న తల్లులు తప్పనిసరిగా ఒక పరిహారం చేయాలి అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై సర్వత్రా చర్చ నడుస్తోంది.
Makar Sankranti | ప్రచారంలో ఉన్న పరిహారం ఏమిటి?
సాధారణంగా ఒక కొడుకు ఉన్న తల్లులు, ఇద్దరు కొడుకులు లేదా ఎక్కువ మంది సంతానం ఉన్న వారి వద్ద నుండి దానంగా డబ్బులు అడిగి తీసుకోవాలని, ఆ డబ్బుతో రంగుల గాజులు కొనుక్కుని ధరించాలని ఒక పుకారు షికారు చేస్తోంది. ఇలా చేయడం వల్ల సంతానానికి ఉన్న కీడు తొలగిపోతుందని చాలా మంది నమ్ముతున్నారు.
Makar Sankranti | పండితుల వివరణ – వాస్తవాలు:
ఈ ప్రచారంపై ఆధ్యాత్మిక పండితులు స్పందిస్తూ, ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని తేల్చి చెప్పారు. మన హిందూ ధర్మ శాస్త్రాల్లో గానీ, పురాణాల్లో గానీ ఇలాంటి ‘గాజుల పరిహారం’ గురించి ఎక్కడా ప్రస్తావన లేదని వారు స్పష్టం చేశారు. పూర్వం గాజుల అమ్మకాలను పెంచుకోవడానికి ఎవరో సృష్టించిన ఈ పుకారు, కాలక్రమేణా ఒక ఆచారంగా మారిపోయిందని వారు అభిప్రాయపడుతున్నారు.
ముఖ్యంగా 2026 సంక్రాంతి పండుగ ఎటువంటి కీడును మోసుకురావడం లేదని, కాబట్టి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని పండితులు భరోసా ఇస్తున్నారు. సంప్రదాయం ప్రకారం పండుగ పూట ఇరుగుపొరుగు వారికి పసుపు, కుంకుమ, తాంబూలం, గాజులు ఇవ్వడం మన సంస్కృతిలో భాగమే తప్ప, అది ఏదో కీడు జరుగుతుందని భయంతో చేయాల్సిన పని కాదు.
భక్తి అనేది భయం నుండి పుట్టకూడదు. సంక్రాంతి అంటేనే కొత్త శక్తిని, సిరిసంపదలను ఇచ్చే పండుగ. కాబట్టి ఇలాంటి అశాస్త్రీయమైన పరిహారాలను నమ్మి ఆందోళన చెందకుండా, సూర్యారాధన, పవిత్ర స్నానాలు, దానధర్మాలతో పండుగను సంతోషంగా జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు.