అక్షరటుడే, వెబ్‌డెస్క్ : National Highway | ఆర్మూర్-జగిత్యాల రోడ్డుకు మహర్దశ పట్టనుంది. ప్రస్తుతం రెండు లేన్లుగా ఉన్న రోడ్డు నాలుగు లేన్లుగా మారనుంది. నిజామాబాద్(Nizamabad) నుంచి కరీంనగర్, వరంగల్ జిల్లాలకు కీలకమైన ఈ జాతీయ రహదారి విస్తరణకు కేంద్ర ప్రభుత్వం(Central Government) తాజాగా ఆమోదం తెలిపింది.
అలాగే, రాష్ట్రంలోని మిగతా నాలుగు రహదారుల విస్తరణకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం రూ.25,661 కోట్లతో హ్యామ్ రోడ్ల నిర్మాణాలకు ఆమోదం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 431 కిలోమీటర్ల రహదారుల నిర్మాణానికి అనుమతి లభించింది. హ్యామ్ విధానంలో కేంద్రం-ఎన్‌హెచ్ఏఐ నిధుల్లో 40:60 నిష్పత్తితో రోడ్ల నిర్మాణం జరుగనుంది. ఆర్మూర్-జగిత్యాల(Armoor-Jagityala) రహదారి నాలుగు లేన్లుగా విస్తరిస్తూ అభివృద్ధి చేయనున్నారు.
National Highway | ప్రత్నామ్నాయలు పరిశీలించినా..
నిజామాబాద్ నుంచి కరీంనగర్, వరంగల్ వంటి ముఖ్య నగరాలకు వెళ్లాలంటే ఆర్మూర్-జగిత్యాల రహదారే కీలకం. ఈ రోడ్డు విస్తరణకు కొన్నేళ్ల నుంచి జరుగుతున్న ప్రయత్నాలు ముందుకు సాగలేదు. నాలుగైదేళ్ల క్రితం ప్రతిపాదనలు రూపొందించినప్పటికీ, విస్తరణ పనులకు మోక్షం లభించలేదు. ప్రస్తుతమున్న మార్గంలో కాకుండా బాల్కొండ, ఏర్గట్ల మీదుగా నిర్మిస్తే నష్ట పరిహారం చాలా తగ్గుతుందని భావించారు. ప్రస్తుత మార్గంలో ఉన్న అనేక గ్రామాల్లో భవనాలు తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడడంతో ప్రత్యామ్నాయ మార్గం కోసం ప్రయత్నాలు జరిగాయి. బాల్కొండ, ఏర్గట్ల మీదుగా పంట పొలాల్లో నేరుగా గ్రీన్ హైవేగా నిర్మించాలని యోచించారు. ఈ మేరకు సర్వే కూడా పూర్తయింది. అయితే, రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకమైన నేపథ్యంలో కేంద్రం పునరాలోచనలో పడింది. చివరకు ప్రస్తుతమున్న రోడ్డునే విస్తరించాలని నిర్ణయించింది.
National Highway | నాలుగు లేన్లుగా విస్తరణ..
ఆర్మూర్ నుంచి జగిత్యాల వరకు ఉన్న 63వ జాతీయ రహదారి(National Highway)ని నాలుగు లేన్లుగా విస్తరించనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆమోదం తెలిపింది. రోడ్డు విస్తరణ కోసం రూ.2,338 కోట్లను మంజూరు చేసింది. ఇక, రాష్ట్రంలోని మిగతా రహదారుల విస్తరణకు కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జగిత్యాల-మంచిర్యాల హైవే విస్తరణకు రూ.2,550 కోట్లు, జగిత్యాల-కరీంనగర్ రహదారి విస్తరణకు రూ. 2,384 కోట్లు కేటాయించారు. హైదరాబాద్ ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టుకు రూ.15,627 కోట్ల నిధుల కేటాయించారు. మహబూబ్‌నగర్-రాయచూర్ రహదారి ఫోర్ లేన్‌గా విస్తరించేందుకు రూ.2,662 కోట్లు మంజూరయ్యాయి.