అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Weather Updates | ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయుగుండంగా మారనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో శనివారం భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందన్నారు.
తెలంగాణ (Telangana)లో నాలుగు రోజులుగా అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. శుక్రవారం పలు జిల్లాల్లో వాన దంచికొట్టింది. శనివారం సైతం పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఉదయం నుంచే ఆకాశం మేఘావృతమై ఉంది. వనపర్తి, గద్వాల్, వికారాబాద్, నారాయణపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, రంగారెడ్డి జిల్లాల్లో ఉదయం భారీ వర్షం కురిసింది. మెదక్, కామారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో చిరు జల్లులు కురుస్తున్నాయి. హైదరాబాద్ (Hyderabad) నగరంలో మధ్యాహ్నం తర్వాత వర్షం కురిసే ఛాన్స్ ఉంది.
Weather Updates | పొంచి ఉన్న తుపాన్ ముప్పు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో సైతం భారీ వర్షాలు పడుతున్నాయి. అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణ, బాపట్ల, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో శనివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రానున్న ఐదు రోజులు మత్స్య కారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. అల్పపీడనం నేడు వాయుగుండంగా మారుతుందని, సోమవారం తుపాన్‌గా మారే అవకాశం ఉందన్నారు.
Weather Updates | రైతుల ఆందోళన
వర్షాలతో రైతులు (Farmers) ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా వరికోతలు జోరుగా సాగుతున్నాయి. చాలా గ్రామాల్లో కోతలు పూర్తయి రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చారు. అయితే కొన్ని చోట్ల మాత్రమే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం అయ్యాయి. చాలా ప్రాంతాల్లో ధాన్యం సేకరణ మొదలు కాకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు రోజులుగా వర్షాలు పడుతుండటంతో వడ్లు తడిసి పోతున్నాయని వాపోతున్నారు.
