అక్షరటుడే, వెబ్డెస్క్ : WEF 2026 | ప్రముఖ బ్యూటీ టెక్ కంపెనీ లోరియల్ హైదరాబాద్ నగరంలో భారీగా పెట్టుబడులు పెట్టనుంది. ఈ మేరకు దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం (State Government)తో ఒప్పందం చేసుకుంది.
దావోస్ వేదికగా జరుగుతున్న WEF 2026 సమావేశంలో తెలంగాణ ప్రతినిధుల బృంధం పలు సంస్థలతో సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో పెట్టుబడుల కోసం పలు సంస్థలు ముందుకు వస్తున్నాయి. దావోస్లో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu)తో లోరియల్ సీఈవో భేటీ అయ్యారు. ప్రపంచంలోనే తొలి బ్యూటీ-టెక్ గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ (GCC)ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడానికి ఆ సంస్థ ముందుకు వచ్చింది. దీనిని ఈ ఏడాది నవంబర్లో ప్రారంభించనున్నట్లు సంస్థ తెలిపింది.
WEF 2026 | కీలకంగా మారనున్న నగరం
లోరియల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నికోలస్ హిరోనిమస్‌తో ప్రతినిధి బృందం జరిపిన సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. భారీ పెట్టుబడితో హైదరాబాద్ (Hyderabad)లో పెద్ద ఎత్తున బ్యూటీ-టెక్ GCCని ఏర్పాటు చేయడం పట్ల సీఈఓ సంతోషం వ్యక్తం చేశారు. ఈ GCC ప్రపంచ ప్రఖ్యాత సౌందర్య సాధనాల కంపెనీకి గ్లోబల్ ఇన్నోవేషన్, టెక్నాలజీ, డేటా, సరఫరా గొలుసు కేంద్రంగా పనిచేస్తుంది. ఈ కొత్త కేంద్రం లోరియల్ డిజిటల్ పరివర్తన, ఏఐ, అనలిటిక్స్ కార్యక్రమాలకు ప్రపంచవ్యాప్తంగా మద్దతు ఇస్తుంది. దీంతో ప్రపంచ సంస్థల కార్యకలాపాలకు కీలక కేంద్రంగా హైదరాబాద్ మారనుంది.పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్, జీసీసీ పెట్టుబడితో పాటు హైదరాబాద్‌లో తయారీ రంగాన్ని కూడా పరిశీలించాల్సిందిగా లోరియల్‌ను ఆహ్వానించారు. హిరోనిమస్ సానుకూలంగా స్పందిస్తూ హైదరాబాద్‌లోని ఒక తయారీ యూనిట్‌లో భవిష్యత్ పెట్టుబడులను పరిశీలించడానికి ఆసక్తి చూపారు.