అక్షరటుడే, కామారెడ్డి : Minister Seethakka | ప్రతి ఒక్క మనిషికి సెల్‌ఫోన్ ఒక సౌకర్యం మాత్రమేనని, హెల్మెట్ మాత్రం అత్యవసరమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. కామారెడ్డి పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద జిల్లా పోలీసు శాఖ (Police Department) ఆధ్వర్యంలో 300 కిలోల స్క్రాప్‌తో ప్రత్యేకంగా తయారు చేసిన హెల్మెట్ నమూనాను మంగళవారం మంత్రి సీతక్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ సురేష్ షెట్కార్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆవిష్కరించారు. అనంతరం పలువురికి హెల్మెట్లు అందజేశారు.
Minister Seethakka | వాహనం నడపడంలో జాగ్రత్త అవసరం..
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మనిషి జీవితం వేగంగా వెళ్తుందని, అదే వేగాన్ని వాహనం నడపడంలో కూడా చూపిస్తున్నామన్నారు. ఆ సమయంలో హెల్మెట్ లేక అనేక ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని తెలిపారు. బతికుంటేనే ఏదైనా చేస్తామని, ప్రతిరోజు రూ.వేలల్లో ఖర్చు చేస్తామని, హెల్మెట్ కోసం మాత్రం ఖర్చు చేయడం లేదన్నారు. ప్రతిఒక్కరి జీవితంలో హెల్మెట్ అనేది నిత్యవసరంగా మారిందన్నారు. అతివేగం ప్రమాదకరమని, ఏ రూపంలో మృత్యువు వస్తుందో తెలియదని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ వాడాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan), ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra), కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి (ASP Chaitanya Reddy), ఇతర అధికారులు పాల్గొన్నారు.
Minister Seethakka | ఇందిరాగాంధీ విగ్రహం ఆవిష్కరణ
అంతకుముందు కామారెడ్డి పట్టణంలోని రైల్వే స్టేషన్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహాన్ని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంపీ సురేష్ షెట్కార్ ఆవిష్కరించారు.