అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Nizamabad CP | ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రాణాలను కాపాడుకుందామని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya) పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో మంగళవారం జరిగిన జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో (National Road Safety Month) ఆయన రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రసంగించారు.
Nizamabad CP | కోవిడ్ కంటే ఎక్కువ రోడ్డు ప్రమాదాల్లోనే..
2020 – 21లో కోవిడ్ వల్ల మరణించిన వారి కంటే ఎక్కువ మంది రోడ్డు ప్రమాదంలో (road accidents) మృత్యువాత పడ్డారని సీపీ ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్‌లో మాస్కులు ధరించి సురక్షితంగా ఉన్నారని కానీ వాహనాలు నడిపే సమయంలో సీటు బెల్టు, హెల్మెట్లు పెట్టుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి అనేకమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారన్నారు. జిల్లాలో రెండేళ్ల కరోనా సమయంలో 200 మంది కరోనాతో చనిపోతే, 2025లో 250 మంది రోడ్డు ప్రమాదంలో చనిపోయారన్నారు.
Nizamabad CP | కుటుంబ భద్రతకు భరోసానిస్తూ..
కుటుంబ భద్రతకు భరోసాను కల్పిస్తూ సురక్షితమైన డ్రైవింగ్ చేయాలని సీపీ సూచించారు. గతేడాది ఫిన్లాండ్ అనే దేశంలో ఒక్క రోడ్డు ప్రమాదం కూడా జరగలేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రమాదాల నియంత్రణకు రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ ‘అరైవ్ అలైవ్’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. డ్రైవింగ్‌లో మూడు సూత్రాలను తప్పకుండా పాటించాలని పోలీస్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ, ముఖ్యంగా యువత అతివేగంతో వెళ్లకుండా నెమ్మదిగా వెళ్లాలని, మొబైల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు తెలిపారు.
Nizamabad CP | రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ..
రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించి, టీషర్ట్స్, ట్రాఫిక్ నిబంధనలతో కూడిన ప్లకార్డులను సీపీ ఆవిష్కరించారు. వాహనదారులకు 100 హెల్మెట్లను ఉచితంగా పంపిణీ చేశారు. అంతర్జాతీయ బాక్సింగ్ క్రీడాకారుడు, అర్జున అవార్డు గ్రహీత హుషాముద్దీన్ను ప్రత్యేకంగా సన్మానించారు. కార్యక్రమంలో నిజామాబాద్ అదనపు డీసీపీ (అడ్మిన్) బస్వారెడ్డి , జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి ఉమామహేశ్వర్, ఆర్టీసీ డిపో మేనేజర్ ఆనంద్, న్యూరో సర్జన్ డాక్టర్ రమణేశ్వర్, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ తదితరులు పాల్గొన్నారు.