అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Sarpanch Elections | స్థానిక సంస్థల ఎన్నికల వేళ పల్లె రాజకీయ ముఖచిత్రం మారుతోంది. సర్పంచ్‌గా పోటీ చేసేందుకు యువత ముందుకు వస్తోంది. ఉద్యోగులు, విద్యావంతులు బరిలోకి దిగేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. లక్షల వేతనాలు వచ్చే కొలువులను సైతం వదిలేసి పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీసులే కాదు.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు (Software Engineers) సైతం పల్లెపీఠంపై కన్నేశారు. ఈ క్రమంలో పట్టణాలను వదిలి గ్రామాల్లో సర్పంచ్‌లుగా పోటీ చేసేందుకు సై అంటున్నారు. ఎస్సై, టీచర్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, జర్నలిస్టు.. ఇలా అన్ని రంగాల వారు స్థానిక పోరులో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మొదటి, రెండో విడత ఎన్నికల్లో చాలా మంది ఉద్యోగులు తమ కొలువులకు రాజీనామా చేసి నామినేషన్లు వేశారు. ఉన్నత విద్యావంతులు సైతం పోటీ చేస్తున్నారు.
Sarpanch Elections | ఉద్యోగాలకు రాజీనామా..
దాదాపు ఏడేళ్ల తర్వాత పంచాయతీ ఎన్నికలు (Panchayat Elections) జరుగుతున్నాయి. ఈ క్రమంలో పోటీకి యువత ముందుకు వస్తున్నారు. వివిధ ఉద్యోగాల్లో స్థిరపడ్డవారు సైతం బరిలో నిలుస్తున్నారు. కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా పని చేస్తున్న పులి వెంకటేశ్వర్లు తన ఉద్యోగానికి రాజీనామా చేసి సర్పంచ్‌గా పోటీలోకి దిగారు. ఇంకా ఐదు నెలల పదవీ కాలం మిగిలి ఉండగానే స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్న ఆయన.. తన పుట్టిన ఊరు కోదాడ మండలం గుడిబండ గ్రామంలో నామినేషన్ వేశారు. ఇక, మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రానికి చెందిన ఎన్ఆర్ఐ కంజర్ల చంద్రశేఖర్ సర్పంచ్‌గా పోటీ చేస్తున్నారు. అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదులుకొని ఆయన పోటీ చేయడానికి వచ్చారు. ఈ గ్రామంలో రెండో దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఊరి కోసం తన తాత చేసిన సేవలను ఆదర్శంగా తీసుకుని ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు చంద్రశేఖర్ తెలిపారు.
దోమకొండ (Domakonda) కస్తూర్బా పాఠశాల లో ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలుగా పని చేస్తున్న భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన తునికి ప్రత్యూష తన కొలువుకు రాజీనామా చేసి సర్పంచ్‌గా పోటీ చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆమె.. అదే రోజు నామినేషన్ వేశారు.
కరీంనగర్ జిల్లా (Karimnagar District) కొత్తపల్లి మండలం నాగులమల్యాల గ్రామానికి చెందిన మల్యాల జాహ్నవి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. తన గ్రామంలో నెలకొన్న సమస్యలు తనని ప్రజాసేవ వైపు నడిపించాయని జాహ్నవి తెలిపారు.
Sarpanch Elections | రాజకీయాలపై ఆసక్తితో..
ఎంత ఉన్నత చదువులు చదివినా, ఎంత పెద్ద ఉద్యోగంలో ఉన్నా.. రాజకీయ నేతల ముందు బలాదురే. ఉద్యోగం, డబ్బు, ఆస్తి ఎంతున్నా ముఖ్యమైన పని పడితే రాజకీయ నేతల వద్దకు వెళ్లాల్సిందే. ఒక్కసారి పదవిలోకి వస్తే ఆ అధికార దర్పం వేరే లెవల్ గా ఉంటుంది. అందుకే ప్రస్తుతం యువత రాజకీయాల వైపు దృష్టి సారిస్తున్నారు. కొలువులు సైతం వదిలి పల్లెల్లో పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే చాలా మంది తమ పదవులకు రాజీనామా చేసి, నామినేషన్లు వేశారు. కామారెడ్డి జిల్లా (Kamareddy District)లో ఓ మహిళా ఉద్యోగి తన టీచర్ కొలువుకు రాజీనామా చేసి, నామినేషన్ వేశారు. ఇక, ఉభయ జిల్లాలో పని చేస్తున్న పలువురు జర్నలిస్టులు సైతం పోటీలోకి దిగారు.
