Homeతాజావార్తలుBandi Sanjay | ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలోకి రండి.. మావోయిస్టులకు కేంద్ర మంత్రి బండి...

Bandi Sanjay | ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలోకి రండి.. మావోయిస్టులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపు

మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. తుపాకీ గొట్టాలతో సమస్యలు తీరవని, బ్యాలెట్ ద్వారానే అన్నింటికీ పరిష్కారం లభిస్తుందన్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bandi Sanjay | బుల్లెట్ వల్ల ఏ సమస్య పరిష్కారం కాదని, బ్యాలెట్​తోనే ప్రజా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. మావోయిస్టులు ఆయుధాలు వీడి జన జీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు.

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా ఎన్ కౌంటర్ (Hidma Encounter) నేపథ్యంలో మంగళవారం వేములవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలో మార్చి 2026 నాటికి మావోయిజం అంతం కావడమే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) లక్ష్యమని చెప్పారు. అందుకు మరో నాలుగు మాసాలు మాత్రమే గడువు ఉందని, నక్సలైట్లు స్వచ్ఛందంగా లొంగిపోవాలని పిలుపునిచ్చారు.

Bandi Sanjay | బుల్లెట్ తో సాధించేదేమీ లేదు..

మావోయిస్టులు ఆయుధాలు, బుల్లెట్లను నమ్ముకుని సాధించేది ఏమీ లేదని బండి సంజయ్ అన్నారు. అడవులను వదిల ప్రజల్లోకి రావాలని, ప్రజాస్వామ్యయుత రీతిలో ప్రజలను చైతన్యవంతులను చేయాలని సూచించారు. తుపాకీ గొట్టంతో కాకుండా సమాజంలోకి వచ్చి ప్రజలను చైతన్యవంతం చేయండని పిలుపునిచ్చారు. బ్యాలెట్​ను నమ్ముకొని దేశంలో మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ (PM Modi) పరిపాలన అందిస్తున్నారన్న కేంద్ర మంత్రి.. బుల్లెట్​ను నమ్ముకొని మీరు మార్చగలిగినది, చేయగలిగినది ఏమీ లేదని గుర్తు చేశారు. హింస తప్ప ఇన్నేళ్లలో ఏమైనా సాధించారా? అని ప్రశ్నించారు. స్వచ్ఛందంగా లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని, తుపాకీ వదిలి జనజీవన స్రవంతిలో కలిసిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

Bandi Sanjay | అర్బన్ నక్సలైట్ల మాటలు నమ్మొద్దు..

నక్సలైట్ల కంటే అర్బన్ నక్సలైట్లు అత్యంత ప్రమాదకరమని కేంద్ర మంత్రి అన్నారు. వాళ్ల మాటలు నమ్మి అడవిలో అన్యాయం కావద్దని మావోలకు సూచించారు. అర్బన్ నక్సలైటు ఏసీ గదుల్లో ఉండి నిరుపేద కుటుంబాల యువతీయువకులను అడవుల్లో తిప్పుతున్నారని మండిపడ్డారు. రాజకీయంగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అర్బన్ నక్సలైట్లు (Naxalites) కొమ్ము కాస్తూ ఆస్తులు కూడగట్టుకుంటున్నారన్నారు. మావోయిస్టులు పేద ప్రజలతో ఆడుకుంటున్నారని బండి సంజయ్ (Bandi Sanjay) ఆక్షేపించారు. నక్సలైట్లలో అనేక నిరుపేద ఎస్సీ ఎస్టీ కుటుంబాల నుంచే ఉన్నారని, అన్యం పుణ్యం ఎరగని మైనర్లకు సైతం తుపాకులు ఇచ్చి వాళ్ల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Bandi Sanjay | చర్చల్లేవు..

మావోలతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తుపాకులు చేత పట్టుకొని చంపుతామని ఒకవైపు చెబుతూ మరోవైపు చర్చలు అంటే ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. అమాయక ప్రజలను, పోలీసులను చంపుతామంటే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. జాతీయ జెండాలు ఎగరవలసిన చోట.. నల్లజెండాలను ఎగరవేస్తే వారిని ఏమనాలని ప్రశ్నించారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు (Maoists) ఇకనైనా ఆయుధాలు వీడి లొంగిపోవాలని బండి సంజయ్ సూచించారు. ఇప్పటికే చాలా మంది చనిపోయారని, ఇక వాటికి అడ్డుకట్ట వేయాలన్నారు. హిడ్మా లాంటి నాయకులే ఎన్ కౌంటర్ లో చనిపోయారని, మిగతా వాళ్లు ఆలోచించుకోవాలని సూచించారు. ఇప్పటివరకు అనేకమంది లొంగిపోయారు.. మిగతావారు కూడా లొంగిపోవాలని పిలుపునిచ్చారు.